ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి శుక్రవారం ప్రవేశించాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్టు అధికారులు తెలిపారు. ఇక, దక్షిణ తెలంగాణతోపాటు తూర్పున ఎల్లారెడ్డి, రామగుండం వరకు విస్తరించాయని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు.
నైరుతి ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు, ఏపీలోని పలుచోట్ల శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఈ ఏడాది 11 రోజులు ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినా సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణ రాష్ట్రంలో ఈసారి 97శాతం మేర సగటు వర్షపాతం నమోదవుతుందని చెప్పారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి వై.కె రెడ్డి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్నారు.
రాబోయే రెండు వారాల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. రైతులకు అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు 15రోజులు ఆలస్యంగా వచ్చాయన్నారు. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ఫపిడనం ,దీని ప్రభావంతో మంచి వర్షాలు కురుస్తాయన్నారు. వచ్చే నెలలో సాధారణం కంటే అధికంగానే వర్షం కురుస్తుందని చెప్పారు.