తొలకరి జల్లులతో తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దవుతున్నాయి. మండే ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో రిలీఫ్ పొందుతున్నారు. ఉదయం ఎండ దంచి కొడుతున్నా సాయంత్రానికి వెదర్ కూల్‌గా మారడం.. రాత్రి వేళల్లో వర్షం పడుతుంటడంతో ఉపశమనం దొరుకుతోంది. మరోవైపు జార్ఖండ్ నుంచి ఉత్తరకోస్తా వరకు అల్పపీడన ద్రోణి నెలకొని ఉందని.. దానివల్ల బుధవారం నుంచి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బుధవారం (7వ తేదీ) నుంచి మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ముఖ్యంగా 7, 8 తేదీల్లో తెలంగాణలో.. 8, 9 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు వర్షాలు లేనిచోట మాత్రం అధిక ఎండలు ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. అప్పుడప్పుడు వర్షాలు కురిసినా పూర్తిస్థాయిలో వాతావరణం చల్లబడదని.. రుతుపవనాలు ప్రవేశించే వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఎండలు తప్పవని చెప్పారు.
గత వారం రోజులుగా కేరళ రాష్ట్రంలోనే ఆగిన రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. ప్రస్తుతం ఝార్ఖండ్ నుంచి తెలంగాణ వరకూ ఉపరితల ఆవర్తనముంది. దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వీటివల్ల పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. ఇంకా తగ్గుతాయని అంచనా. నైరుతి రుతుపవనాలు ఈనెల 5 కల్లా తెలంగాణకు వస్తాయని తొలుత వాతావరణశాఖ వేసిన అంచనా ఇప్పుడు తప్పింది. ఈనెల 8లోపు వచ్చే అవకాశాలు లేవు. గతేడాది జూన్ 17న తెలంగాణకు రుతుపవనాలు వచ్చాయి. ఈసారి వేచి చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.