హైదరాబాద్లో ఇవాళ వేకువజామున భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీగా కురుస్తోన్న వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయమై వరద ప్రవహిస్తుంది. దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లో కరెంట్ సేవలు నిలిచిపోయాయి. పంజాగుట్ట జంక్షన్ వద్ద నీరు భారీగా స్తంభించిపోయి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.
అబ్దుల్లాపూర్మెట్, పెద్ద అంబర్ పేట్, తుర్కయాంజల్, హయత్ నగర్, వనస్థలిపురం, చైతన్యపురి, నాగోల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, చంపాపేట, సైదాబాద్, బేగంపేట్, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్పల్లి, చిలకలగూడ, మారేడ్పల్లి, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
ఉపరితల ఆవర్తన ధ్రోణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని, హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.