వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలోని స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటించారు.
భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడిందని ఇది తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పాటు దక్షిణ బంగాళాఖాతంలో శుక్ర, శనివారాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయనే అంచనాలు ఉన్నాయి.
రాబోయే ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఇవాళ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయంటున్నారు. అలాగే బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసర సహాయం కోసం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని సూచించారు.
Also Read:కే ర్యాంప్..బ్రేక్ ఈవెన్!

