బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోంది. 4.5 కిలో మీటర్లు ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతోంది.
ప్రస్తుతం దక్షిణ తమిళనాడు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక, కోమోరిన్ ప్రాంతాల నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నది. మరో వైపు తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 2.1 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో మూడు రోజులు తెలంగాణలో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఓ మోస్తరు వానలు కురిసే అవకాశమున్నదని అధికారులు తెలిపారు.