ప్లాస్టిక్ మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. మళ్లీ మళ్లీ ఉపయోగించే సీసాల్లో అది కనిపిస్తుంది. ముఖ్యంగా వంటగదులు, బాత్‌రూమ్‌లలో ప్లాస్టిక్ వినియోగం విస్తృతంగా ఉంది. అయితే దాని భద్రతపై సందేహాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోజువారీ ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు.
ప్లాస్టిక్ పాత్రలు పూర్తిగా సింథటిక్ రసాయనాలతో తయారవుతాయి. కాలక్రమేణా ఇవి ఆహారం లేదా నీటిలో కలిసే అవకాశం ఉంది. ప్లాస్టిక్‌ను ఎంత ఎక్కువ వేడి చేస్తే అంత ఎక్కువ రసాయనాలు విడుదలవుతాయి. అలాగే తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్ ఎక్కువగా లీక్ అవుతుంది. పాత పాత్రల్లో రక్షణ పొర తగ్గిపోవడంతో లీకేజీ పెరుగుతుంది.
మైక్రోప్లాస్టిక్స్ అనేవి కంటికి కనిపించని అతి చిన్న ప్లాస్టిక్ కణాలు. ఎండ, పర్యావరణ ప్రభావాలతో పెద్ద ప్లాస్టిక్ వస్తువులు క్రమంగా విరిగిపోవడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి ఇప్పుడు ఆహారంలో, ఊపిరితిత్తుల్లో, రక్తంలో, కణాల లోపల కూడా కనిపిస్తున్నాయని డాక్టర్ శర్మ తెలిపారు. అంటే ఇవి ఇక బయటి సమస్య మాత్రమే కాదు, శరీరంలోకి ప్రవేశించాయి.
ప్లాస్టిక్ రసాయనాలు లేదా మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి చేరినప్పుడు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. కణజాలంపై ఒత్తిడి పెంచే వాపు (ఇన్‌ఫ్లమేషన్)
వంటివి కలగవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం నేరుగా క్యాన్సర్‌కు కారణమనే బలమైన ఆధారాలు లేవని, కానీ కొన్ని జీవశాస్త్ర మార్గాలపై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదం తక్కువైనా నిర్లక్ష్యం చేయలేమని హెచ్చరించారు.
సాధ్యమైనంతవరకు ప్లాస్టిక్‌లో ఆహారాన్ని వేడి చేయవద్దు. వేడి ఆహారం, మళ్లీ వేడి చేయడానికి గాజు లేదా సిరామిక్ పాత్రలు వాడండి. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు సాధారణంగా స్థిరమైన ప్లాస్టిక్‌తో తయారవుతాయి; 50°C కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో లీకేజీ ఉండదు. బకెట్లలో నిల్వ చేసే స్నానపు నీరు తాగడానికి కాదు కాబట్టి ప్రమాదం తక్కువ.
Also Read:జీఎస్టీ ఎగవేత..కాంగ్రెస్ నాయకుడు అరెస్టు!
బేబీ మిల్క్ బాటిళ్లు BPA-రహితంగా ఉంటాయి, అయినా స్టీల్ లేదా గాజు బాటిళ్లు మరింత భద్రం. బాటిల్ నిప్పుల్స్ సిలికాన్‌తో ఉండాలి. మంచి నాణ్యత గల సిలికాన్ మోల్డ్స్ మోస్తరు ఉష్ణోగ్రతల్లో బేకింగ్‌కు సురక్షితం. మైక్రోప్లాస్టిక్‌లు సుమారు 50 శాతం తాగునీటి ద్వారా శరీరంలోకి చేరుతాయని డాక్టర్ శర్మ తెలిపారు. కాబట్టి వాటర్ ఫిల్టర్ వాడటం సులభమైన, ముఖ్యమైన అడుగు. ఇంట్లో బయటకంటే మైక్రోప్లాస్టిక్‌లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన గాలి ప్రవాహం, క్రమం తప్పకుండా వాక్యూమ్ చేయడం, తుడవడం వంటి చర్యలు కూడా ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

