వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలి : హరీశ్ రావు

33
harish
- Advertisement -

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం అన్ని జిల్లాల వైద్యాధికారులు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు, వైద్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా జిల్లాల్లోని పరిస్థితులను సమీక్షించి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించారు. వర్షాల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుండి ప్రజల్ని కాపాడాలని వైద్య సిబ్బంది పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉండాలని సూచించారు. ఎలాంటి కేసులు వచ్చినా అడ్మిట్ చేసుకొని వెంటనే వైద్యం అందించాలన్నారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులు తెల్సుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ సైతం పూర్తి స్థాయిలో అప్రమత్తతో ఉండాలన్నారు.

సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలన్నారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, డయేరియా తదితర రోగాల పట్ల అవగాహన పెంచాలని, రోగ నిర్దారణ పరీక్షలు వెంటనే నిర్వహిస్తూ అవసరం అయిన వారికి చికిత్స అందించాలన్నారు. సబ్ సెంటర్ స్థాయి నుండి జిల్లా ఆసుపత్రి వరకు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో, స్థానిక ప్రజా ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు.

108 వాహ‌నాలు వెళ్ళలేని ప్రాంతాలను ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వాగులు పొంగటం, రోడ్లు చెడి పోవడం వల్ల కొన్ని గిరిజన ప్రాంతాల‌కు రోడ్ కనెక్టివిటీ పోయే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి చోట్ల రోగులతో పాటు గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సహా డైట్, పారిశుద్ధ్య విభాగాల్లో పని చేసే వారికి వేతనాలు సకాలంలో అందే విధంగా బిల్స్ త్వరిత గతిన సబ్‌మిట్ చేయాలన్నారు. ప్ర‌సూతి, ఆర్థోపెడిక్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, కంటి, గుండె స‌హా అన్ని విభాగాల్లో ఆరోగ్య శ్రీ సేవ‌లను విస్తరించాలన్నారు. ప్ర‌ణాళిక రూపొందించుకొని ఆప‌రేష‌న్ థియేట‌ర్ వినియోగం పెంచాలన్నారు. రోగుల‌కు త్వరిత గతిన సేవలు అందించాలని చెప్పిన ఆయన.. ఈ విషయంలో మంచి పనితీరు నమోదు చేసిన ఎంజీఎం, నిజామాబాద్, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రులను అభినందించారు.

జిల్లా స్థాయిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కేసులను అనవసరంగా హైదరాబాద్‌కు రిఫర్ చేయవద్దన్నారు. సాధారణ ప్రసవాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్య‌ను తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ణ‌నీయంగా పెంచిందని గుర్తు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 720 గా ఉన్న జాబితాను 843కు పెంచామని దీంతో కొత్త‌గా 123 ర‌కాల మందులు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అందుబాటులోకి రానున్నాయని….. ప్రతి వైద్యుడికి ఈ జాబితాలోని మందుల వివరాలు తెలిసేలా బుక్‌లెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని ప్రకారం జనరిక్ మెడిసిన్ సూచించాలనీ, బ్రాండెడ్ మందులు రాయడం అనేది ఉండొద్దనీ చెప్పారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు అన్ని వేళ‌లా అందించేందుకు వీలుగా అన‌స్తీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాలనీ, వారానికి ఒక విభాగం వారీగా సూప‌రింటెండెంట్లు స‌మీక్షలు నిర్వ‌హించాలనీ, వారం వారం పురోగ‌తి మెరుగుప‌డేలా చూడాలనీ ఆదేశించారు.

- Advertisement -