కన్నడ రాజకీయాలు క్షణం క్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. జేడీఎస్‌కు మద్దతిచ్చిన కాంగ్రెస్ ఆ పార్టీ ఎవరు చెబితే వారే సీఎం అని ప్రకటించింది. దీంతో సీఎంగా కుమారస్వామి ఎన్నికల లాంఛనం కానుందని అంతా భావిస్తుండగా మరో ఆసక్తికర వార్త కర్నాటకలో చక్కర్లు కొడుతోంది.
తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. జేడీఎస్ కీలక నేత, దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. తనతో పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమని బీజేపీకి రేవణ్ణ భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే… కన్నడ నాట బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు సింగపూర్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు కుమారస్వామి. ఇవాళ రాత్రికి ఆయన బెంగళూరు చేరుకోనుండటంతో ఏం జరుగుతుందో…ఎవరు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. జేడీఎస్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని సిద్ద రామయ్య ప్రకటించారు. కాసేపటి క్రితం గవర్నర్‌కు రాజీనామకు సమర్పించిన సిద్దూ…ప్రజల తీర్పే శిరోదార్యమని తెలిపారు.