ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందాన్ని ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డుతో ఆదివారం మహబూబ్ నగర్ లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ కాకతీయ కళావైభవానికి రాజకీయంతో సంబంధం లేదని, కళలను ప్రోత్సహించేందుకే దానిని ఏర్పాటు చేసినట్లు కాకతీయ లలిత కళా పరిషత్ ఛైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. హాస్యనటుడు బ్రహ్మనందం సార్థక నామధేయుడని, ఆయన పేరులోనే ఆనందం ఉందని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి పేర్కొన్నారు. యావత్ జాతికి హాస్యాన్ని పంచుతున్న మహానటుడని కొనియాడారు.
మహబూబ్‌నగర్‌లో ఆదివారం రాత్రి టీఎస్‌ఆర్ కాకతీయ లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో కాకతీయ కళా వైభవ మహోత్సవం నిర్వహించారు. 1100 చిత్రాలు పూర్తి చేసుకున్న బ్రహ్మానందంకు సంస్థ ఆధ్వర్యంలో ‘హాస్యనటబ్రహ్మ’ బిరుదును ప్రదానం చేశారు. బ్రహ్మానందం చేతికి మధుసూధనాచారి బంగారు కంకణం తొడిగి వీణను, జ్ఞాపికను బహూకరించారు. సభాపతి మాట్లాడుతూ.. కాకతీయ కళా వైభవం కార్యక్రమాల ద్వారా కాకతీయుల కీర్తిని విశ్వవ్యాప్తం చేయడానికి సుబ్బరామిరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. బ్రహ్మానందం, కార్యక్రమ నిర్వాహకుడు, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి జిల్లాలో కాకతీయ కళా వైభోత్సవాలు నిర్వహిస్తానన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని అన్నారు.
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కళాలకు ప్రాంతాలతో సమానంలేదని, కళాకారులను తెరాసా ప్రభుత్వం సముచితమైన గౌరవం ఇస్తుందన్నారు. కేంద్ర మాజీమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గొప్పనటుడు బ్రహ్మనందాన్ని పాలమూరు వేదికగా సన్మానించటం అభినందనీయమన్నారు. ఇక్కడ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుబ్బరామిరెడ్డిగారికి ధన్యవాదాలు’’ అని అన్నారు. అంతకు ముందు కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.. సినీ ప్రముఖుల హాజరు పాలమూరువాసులను ఆనందాన్ని పంచింది.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడితో పట్టణం పులకించింది.