హర్యానా,మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల

508
maharasthra elections
- Advertisement -

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఎన్నికల నిర్వహణ విషయమై సెప్టెంబరు 27న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్‌ అరోరా. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 27 మొదలై.. అక్టోబరు 4 నాటికి ముగుస్తుందని తెలిపారు. అక్టోబరు 21న పోలింగ్‌ జరుగుతుందని.. అదే నెల 24 కౌంటింగ్‌ ఉంటుందని వెల్లడించారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాల్సిందిగా రాజకీయ పార్టీలకు విఙ్ఞప్తి చేశారు.

దేశ వ్యాప్తంగా 64 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా ఎన్నికలు జరగనున్నాయి.

మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది, హర్యానాలో 1.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన గడ్చిరోలి, గొండియాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -