జనక మహారాజు పాత్రలో కేంద్రమంత్రి హర్షవర్థన్ ఆకట్టుకున్నారు. ఢిల్లీలో జరిగిన రామ్లీలా నాటకంలో హర్షవర్థన్ జనకుడి పాత్ర పోషించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, కిరీటం, రాజులాంటి మేకప్ చేసుకుని గుర్తుపట్టలేకుండా తయారై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో జనక మహారాజు వేషంలో పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఏర్పరుచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
ప్రజలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటారని.. గాలి స్వచ్చంగా మారితే అది ఆరోగ్యకరమైన జీవనానికి దారితీస్తుందని ఈ సందర్బంగా కేంద్రమంత్రి అన్నారు. తన నాటకానికి ముందు హర్షవర్థన్ ట్వీట్ చేస్తూ..సీతా దేవి తండ్రి అయిన జనక మహారాజు పాత్ర వేస్తున్నట్లు ఫోటోలు పోస్ట్ చేశారు.
సీత స్వయంవరానికి ఆహ్వానం పలుకుతూ జనకుడి పాత్రలో ఆయన చెప్పిన డైలాగ్స్ కు పలువురు ఫిదా అయ్యారు. కేంద్రమంత్రి హర్షవర్థన్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే గుప్తా కూడా ఈ నాటకంలో మహర్షి పాత్రలో అదరగొట్టగా… ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ మరో వేషంతో అలరించారు.