తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఎమ్మేల్యే దానం నాగేందర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కు లేఖ రాశారు.
హరీష్ రావు తన లేఖలో ముఖ్యంగా ఒక ప్రశ్నను లేవనెత్తారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేసినప్పటికీ, ఆయన పార్టీ మార్పుకు సంబంధించిన ఆధారాలు లేవని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇవ్వడం సరైందా అని ప్రశ్నించారు. ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తున్న రాజకీయ పరిణామాలను పక్కనబెట్టి ఇలాంటి తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
హరీష్ రావు తన లేఖలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా నేరుగా ప్రశ్నించారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని పేర్కొన్నారు. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకోకపోతే, ఇది పార్టీ మార్పులను ప్రోత్సహించినట్టే అవుతుందని ఆయన విమర్శించారు.
ఇది కేవలం ఒక ఎమ్మెల్యే విషయమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన అంశమని హరీష్ రావు పేర్కొన్నారు. స్పీకర్ ఇచ్చిన తీర్పును మీరు సమర్థిస్తారా? లేక దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తారా? అని రాహుల్ గాంధీని నేరుగా ప్రశ్నిస్తూ ఆయన తన లేఖను ముగించారు.
Also Read:‘పెద్ది’..క్రేజీ అప్‌డేట్

