కరోనా వైరస్ నేపథ్యంలో సరుకుల రవాణా ఆగి పోవడం వల్ల పట్టణాలలో కూరగాయల ధరలు పెరిగాయి…. గ్రామాల్లో తగ్గుముఖం పట్టాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం లో ఏర్పాటు చేసిన మార్కెట్ ను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
స్ధానికంగా కూరగాయలకు ధర రావడం లేదని మంత్రికి మొర పెట్టుకున్నారు. రైతులు తమ కూరగాయలను హైదరాబాద్ మార్కెట్ కు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చిన హరీష్…రైతులకు మాస్క్ లు పంపిణీ చేశారు.
కూరగాయల ధరలు తగ్గడం వల్ల రైతులు పంట పొలాల్లో కూరగాయలను పారబొస్తున్నారని…. హైదరాబాదులో మిర్చి ధర 100 టమాట ధర 50 పలుకుతుందన్నారు. వ్యవసాయ శాఖ సమన్వయంతో సరుకులకు అనుగుణంగా వాహనాలు ఏర్పాటు చేస్తామని… గ్రామం నుండి ఒక రైతు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏర్పాటు చేసి బోయినపల్లి మార్కెట్ కు తరలించే ఏర్పాటు చేస్తాం అన్నారు.
హైదరాబాద్ ప్రజలకు కూరగాయలు అందుబాటులో ఉండేలా వెసులుబాటు కల్పిస్తామని.. గ్రామాల్లోని కూరగాయలను హైదరాబాద్ తరలిస్తామన్నారు. ఇప్పటికే ప్రజలు వారం రోజులకు సరిపడే విధంగా కూరగాయలను కొన్నారని… సంగారెడ్డి, పటాన్‌చెరువు ప్రాంతాల ప్రజలకు కూరగాయలకు డిమాండ్ ఉందన్నారు.
ప్రజలు తమ ఇళ్లలోనే ఉండి సహకరిస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని… చేయి దాటితే ఏం చేయలేం, ఓపికతో ఉండాలన్నారు. ఇటలీ, అమెరికా వంటి దేశాల పరిస్థితి అందరికీ తెలుసని.. ముసలి వాళ్లను ఇటలీ దేశంలో రోడ్లపైన వదిలేస్తున్నారని చెప్పారు.
ప్రతి ఒక్కరు మూడు వారాలపాటు జాగ్రత్తగా ఉండాలని…మీకు తెలిసిన వారు ఎవరైనా తప్పు చేస్తే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వారికి పాసులు అందిస్తున్నాం, రైతు లను కాపాడుకుంటామని చెప్పారు. రైతులకు అవసరమగు ఎరువులను ఏర్పాటు చేస్తాం… డైరీ ,పౌల్ట్రీ రైతులకు దాన సరఫరా చేస్తాం అన్నారు. ఎవరు బయటకు రావద్దు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి….కరోనాపై సీఎం కేసీఆర్ ప్రతినిమిషం మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు.