రంగనాయక సాగర్‌లోకి కాలేశ్వరం పంప్ హౌసుల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు.సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లపూర్‌లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించారు హరీష్. సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో పంట సాగు అవుతుందన్నారు. పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని విజ్ఞప్తి చేయగా, అనంతసాగర్ నుండి 1 టిఎంసి నీళ్లను రంగనాయక సాగర్‌కు పంపినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదాలు చెప్పారు.
నా కోరిక మేరకు ఒక్క టిఎంసి నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుంది.. ప్రజలకు నష్టం చేయకూడదు అన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2లో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి… ఎస్సారెస్పీ నీరు తగ్గినప్పటికీ, కాలేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం అన్నారు.
కాళేశ్వరంలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 23 కిలోమీటర్ల టన్నెల్లు బాగున్నాయి, 19 సబ్ స్టేషన్లు బాగున్నాయి, 21 హౌసులు బాగున్నాయి, ప్రెజర్ మైన్లు బాగున్నాయి.. మేడిగడ్డలో ఏడు బ్లాకులు ఉంటే, అందులో ఒక్క బ్లాక్‌లో ఒక్క పిల్లర్ మాత్రమే కుంగిపోయింది. కానీ గోరంతను కొండంత చేసి టిఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చారు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో మేడిగడ్డలో పొంగిన పిల్లర్లను బాగు చేసే తీరిక ప్రభుత్వానికి లేదు అన్నారు.
నేడు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.. ఆ నీళ్లను లిఫ్ట్ చేసి లక్షల ఎకరాల పంటను కాపాడే అవకాశం ఉంది.. కేసీర్ మీద కోపంతోనే, టిఆర్ఎస్ మీద కోపంతోనే, తెలంగాణ రైతులకు అన్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు.ఈ ప్రాంతంలో 500-1000 ఫీట్ల బోర్లు వేసినా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు రంగనాయక సాగర్ కింద, అనంతసాగర్ కింద, మల్లన్న సాగర్ కింద పండే పంట కాలేశ్వరం పంట కాదా?, కళ్లు ఉండి కల్లు లేని కబోధుల్లా… చెవులు ఉండి చెవిటివాళ్లలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.పెండింగులో ఉన్న పంట కాలువల పనులు పూర్తి చేయాలి అన్నారు.
కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి?, రైతులతో పాటు మత్స్య సంపద కూడా పెరిగి, మత్స్యకారులకు ఆదాయం వస్తుంది. అన్ని వర్గాలకు మంచిచేసే ఇలాంటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు.కాళేశ్వరం తెలంగాణకి వరప్రదాయిని.. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరవండి.. లేదంటే చరిత్ర మిమ్ములను క్షమించదు అన్నారు.
Also Read:కేసీఆర్ కృషి ఫలితం.. సీతారామ ప్రాజెక్టు

