జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతాబాయి తండాలో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో నీళ్లు రాక బోర్లకు నీళ్లు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు హరీశ్ రావు తో ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలను చూపి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడు నెలల్లో శివశంకర్ అనే రైతు 6 బోర్లు, సత్యమ్మ 4 బోర్లు, నర్సింహ 3 బోర్లు, జంకు 9 బోర్లు, లక్ష్మి 6 బోర్లు, విజయ 4 బోర్లు వేసినా నీళ్లు పడలేదని వివరించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా తో మాట్లాడుతూ..రైతుల బాధలను చూస్తుంటే గుండె కదిలిపోతోంది.నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఒక్కోరైతు నాలుగైదు బోర్లు వేసి అప్పుల పాలయ్యారు. గోదావరి నదిలో నీళ్లు ఉన్నప్పటీ ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తేసింది.ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. రైతులను, రైతు కూలీలను, కౌలు రైతులను మోసం చేసింది. ఎన్నికల ముందు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిందన్నారు.
డిసెంబర్ 9న 2 లక్షల మాఫీ చేస్తామని హామీ ఇచ్చి వంద రోజులు దాటినా నెరవేర్చలేదు. రైతుబంధు కింద 15 వేలు ఇస్తామని మోసం చేసిండ్రు. గతంలో మేమిచ్చిన పది వేలు కూడా ఇవ్వడం లేదు.కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని మోసం చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలువకు పుష్కలంగా నీళ్లు వచ్చినయి. రైతులు రెండు పంటలు పండించుకుని సంతోషంగా ఉండేవారు. బంగారు పంటలు పండేవన్నారు. బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం. బోనస్ ఇవ్వకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్‌కు లేదు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌కు వాళ్లు గుణపాఠం చెప్తారన్నారు.
Also Read:Sukumar:సుక్కు నెక్ట్స్ ఎవరితో?