రాష్ట్రానికి కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు – వాస్తవాలు పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వెళ్తాం అన్నారు. ఎవ్వడు ఇక్కడ భయపడడం లేదు…భాజప్త విచారణకు హాజరు అవుతాం…మాకేం భయం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అని తప్పుడు ప్రచారం చేస్తరు ఈ కాంగ్రెస్ నాయకులు… ఒక ఏడాది కరువు వస్తే, ఎస్సారెస్పీకి కూడా నీళ్లను రివర్స్ పంపింగ్ చేసినం అన్నారు. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి నీళ్లు తెచ్చి, ఎల్ఎండీ ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్ 1 కు నీళ్లిచ్చినం, ఎస్సారెస్పీ స్టేజ్ 2లో, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీరందించినం…కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.
ఇది వాస్తవమైన రిపోర్టు – నీటిపారుదలశాఖ అధికారులిస్తున్న రిపోర్టు.. కానీ కాంగ్రెస్ నాయకులు 50 వేల ఎకరాలే పారిందని దుష్ప్రచారం చేస్తున్నరు అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు గోదావరి జలాల సద్వినియోగానికి ఎవరూ కృషి చేయలేదు… 2007 నుంచి 2014 వరకు కేంద్రంలో, మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్పప్పటికీ తుమ్మడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఏ అనుమతి సాధించలేదు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలొ ఆలోచన చేసినం, తెలంగాణ పచ్చబడాలంటే గోదావరి జలాలే కావాలనుకున్నం…గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంటే, అందులో 750 కి.మీ. తెలంగాణలోనే ప్రవహిస్తది అన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1480 టీఎంసీల కేటాయింపులుంటే, తెలంగాణ వాటా 969 టీఎంసీలు…. కానీ, వాస్తవంగా అందులో తెలంగాణ వాడకం ఏనాడూ 400 టీఎంసీలు మించలేదు,2014 వరకు తెలంగాణలో గోదావరిపై కట్టిన ప్రాజెక్టులు ఎస్సారెస్పీ, దేవాదుల మాత్రమే… తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా వస్తే, తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది అన్నారు. అక్కడ నీటి లభ్యత ఉండదు, ప్రాణహిత చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 11 టీఎంసీలు మాత్రమే…కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు.. ఎంత తేడా అన్నారు.
2014 వరకు కాంగ్రెస్ నాయకులు సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ. 2328 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే, పనులు జరగనేలేదు…ఇందులో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట 1052 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాహా చేసిందని స్వయంగా కాగ్ తన రిపోర్టులో వెల్లడించింది. ఇట్లా ఆ పైసలు కాంగ్రెస్ నాయకులు తీసుకొని జేబులు నింపుకున్నరు అన్నారు. అప్పుడు మంత్రులుగా ఉన్నది కూడా ఇదే కోమటిరెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబులే. ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి విమర్శించిండు. జలయజ్ఞం కాదు.. ధనం యజ్ఞం అన్నడు కానీ ఈరోజు రేవంత్ రెడ్డే కాంగ్రెస్ అవినీతిని వెనకేసుకొస్తున్నడు… ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ప్రాణహిత చేవెళ్ల కోసం మేం 10 వేల కోట్లు ఖర్చు పెట్టినం, ఇంకో 20 వేల కోట్లు పెడితే అయిపోతుండె అన్నడు అన్నారు.
Also Read:కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు – వాస్తవాలు
నేను లెక్కలన్నీ తీయిస్తే, 3700 కోట్లు మాత్రమే కాంగ్రెస్ ఖర్చు చేసినట్లు తేలింది. ఎందుకీ గోబెల్స్ ప్రచారం?, ప్రాజెక్టు ఖర్చు పెరిగిందని దుష్ప్రచారం చేస్తున్నరు ఈ కాంగ్రెస్ నాయకులు. 2007లో రూ.17,875 కోట్లకు జీవో ఇచ్చి, ఏ పని చేయకుండానే ప్రాజెక్టు ఖర్చును రూ.38,500 కోట్లకు పెంచింది కూడా వీళ్లే..• ఆ తర్వాత కేంద్రానికి పంపినపుడు రూ.40,300 కోట్లకు పెంచారు ఇదే కాంగ్రెస్ నాయకులు. ఇదీ వీళ్ల నిర్వాకం అన్నారు.

