మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలిపేందుకు సభా నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తున్నం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీలో మాట్లాడిన హరీశ్..వారు పెద్దల సభలో 33 సంవత్సరాలు పనిచేశారు,ఈరోజు మన పెద్దల సభ శాసనమండలిలో కూడా వారికి నివాళులర్పిస్తే మరింత బాగుండేదన్నారు. ఎందుకు మండలిలో పెట్టలేదని చాలా మంది అడుగుతున్నారు.. మన్మోహన్ సింగ్ మనమధ్య లేకపోయినా, వారి సేవలు చరిత్ర ఉన్నంతకాలం ఉంటాయి అన్నారు.
సామన్య కుటుంబంలో పుట్టి, వీధి దీపాల మధ్య, లాంతర్లు పెట్టుకొని, స్కాలర్ షిప్ మీద ఆధారపడి చదువుకొని అసమాన్య వ్యక్తిగా ఎదిగారు…ఆర్థికశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడిగా, దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్లారంటే, వారి క్రమశిక్షణ గలిగిన వ్యక్తిత్వం, దేశం కోసం కష్టపడి పనిచేయాలనే పట్టుదలే కారణం అన్నారు. విదేశాల్లో కూడా వారికెన్నో గొప్ప అవకాశాలొచ్చాయి… విదేశాల్లో పెద్ద ఉద్యోగాలను తిరస్కరించి, ఈ దేశం నాకు ముఖ్యం అని మాతృభూమి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు వారు అన్నారు.
వారేనాడూ పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు, పదవులే ఆయన దగ్గరకు వచ్చాయి… యూజీసీ చైర్మన్ గా, ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థికశాఖ ముఖ్య సలహా దారుగా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా, ఆటమిక్ ఎనర్జీ, స్పేస్ కమిషన్ సభ్యుడిగా,దేశ ఆర్థిక మంత్రిగా,ప్రధానిగా ఎన్నో గొప్ప పదవుల్ని అంకితభావంతో నిర్వహించిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు.
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఐదేండ్ల మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపారు పీవీ, మన్మోహన్,ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోతే, ఆ ఓటమికి మన్మోహన్ సింగ్, పీవీ ఆర్థిక విధానాలు కారణమని ఏఐసీసీ ఆంటోనీ కమిటీ రిపోర్టు ఇచ్చిందన్నారు. దీనిపై ఏఐసీసీలో చర్చపెడితే కంట తడి పెట్టారే తప్ప, తనను తప్పుపట్టారని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు మన్మోహన్. అందుకే ఆయన్ను లాయలిస్టు అన్నారు.ఆనాడు మన్మోహన్ గారు కంటతడి పెట్టిన వార్తపై దేశమంతా చర్చ జరిగింది…మరో సందర్భంలో యూపీఏ భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్ కి 2 ఏండ్ల జైలు శిక్ష పడితే, వారిని రక్షించేందుకు ఒక ఆర్డినెన్స్ తెచ్చారు అన్నారు.
Also Read:గేమ్ ఛేంజర్..అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం
ఆర్బీఐ గవర్నర్ గా కరెన్సీ నోట్లపై సంతకం చేసిన మన్మోహన్ సింగ్ గారు ఆర్ధికమంత్రిగా, ప్రధానమంత్రిగా దేశంపై చెరగని సంతకం చేశారు…తరతరాలు గుర్తుంచుకునేలా ఆయన జీవితం దేశ సేవలో ధన్యమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, సంపూర్ణ మద్దతిస్తుంది… మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడానికి మేం మద్దతు పలుకుతున్నం అన్నారు.