2 లక్షల ఉద్యోగాలు ఏవీ?:హరీష్

4
- Advertisement -

ఎన్నికల ముందు అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మరించారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు.ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ముఖ్యమంత్రికి, దానికి అతి సమీపంలో ఉన్న అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఎందుకు కనిపించలేదని హరీష్ రావు ప్రశ్నించారు.

ఎన్నికల ముందు ఇదే లైబ్రరీకి వెళ్లి విద్యార్థులకు కొండంత ఆశలు కల్పించిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక అదే విద్యార్థులపై పోలీసులతో లాఠీచార్జి చేయించడం దుర్మార్గం అని ఆయన విమర్శించారు.

నాడు నిరుద్యోగుల పక్షాన పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన భట్టి విక్రమార్క, బల్మూరి వెంకట్, ప్రొఫెసర్ కోదండరాం వంటి నేతలు నేడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. వీరి నోళ్లు ఇప్పుడు మూగబోయాయా? అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ‘మెగా డీఎస్సీ’ వేస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారని నిరుద్యోగులు ఆరోపించారు.

ఎన్నికల ముందు చెప్పినట్లుగా మెగా డీఎస్సీ ఊసే లేదని, నిరుద్యోగ భృతి హామీ అటకెక్కిందని మండిపడ్డారు.అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఒక “డమ్మీ” అని, అందులో స్పష్టత లేదని వారు విమర్శించారు.

పాత నోటిఫికేషన్లకే ప్రచారం: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 77 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లనే తాము ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారే తప్ప, కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి విలాసాలకు, సినిమా వేడుకలకు ఇచ్చే ప్రాధాన్యత నిరుద్యోగుల గోడు వినడానికి ఇవ్వడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇచ్చిన హామీల మేరకు తక్షణమే 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Also Read:దానిమ్మ, ఉసిరి-కర్బూజా జ్యూస్..ప్రయోజనాలు!

- Advertisement -