కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవాలన్న కొందరి కలలు కల్లలయ్యాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ద్వారా ఈ నెలలోనే పైసా ఖర్చుపెట్టకుండా నీళ్లిస్తామన్న ఆయన..యాసంగిలో ఒక్క గుంట కూడా ఎండిపోకుండా నీరందించి చూపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై కేంద్ర మంత్రులు చేస్తున్న విమర్శల్ని కొట్టిపారేశారు. శాసనమండలిలో రాష్ట్రంలో అతివృష్టి గోదావరి పరివాహక ప్రాంతాల పరిస్థితిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు. కాళేశ్వరం అనుమతి పత్రాలను మండలిలో చూపించారు. కేంద్రం ఇచ్చిన అనుమతుల వివరాలను చదివి సభ్యులకు వినిపించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం మన ప్రాణేశ్వరమని హరీశ్‌రావు ఉద్ఘాటించారు.
కాళేశ్వరం అద్భుతమని సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి నేర్చుకొనేందుకు వచ్చామని ఆయనే అన్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌజ్ ల మరమ్మతులను ఏజెన్సీ ద్వారానే చేయిస్తం. 21 పంప్ హౌజ్ లకుగానూ .. మేడిగడ్డ, అన్నారంలలోకి కొన్ని వరద నీళ్లు వచ్చాయి. సెప్టెంబరు మూడోవారంలో అన్నారం పంప్ హౌజ్ మళ్లీ నీళ్లు పోస్తుంది. అక్టోబరు చివరికల్లా మేడిగడ్డ మోటార్లు పనిచేస్తాయి అని హరీశ్ రావు వెల్లడించారు.
కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదనడం సరికాదన్నారు. ఆ ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల పంట పండిందని ఆయన గుర్తు చేశారు. గత మూడేళ్లలో మొత్తం లక్ష కోట్లు విలువ చేసే పంట పండిందన్నారు. కాళేశ్వరం వల్ల డబ్బు వృథా కాలేదు.. ముమ్మాటికి ఆదా అయింది అని హరీశ్ రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు లక్ష కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. ఇవాళ శాసన మండలి సమావేశాలలో హరీశ్ రావు మాట్లాడారు.
ప్రాజెక్టు కట్టిన సమయం నాటితో పోలిస్తే.. ఇప్పుడు సిమెంటు ధరలు, స్టీలు ధరలు, భూ సేకరణ వ్యయాలు బాగా పెరిగాయన్నారు. ప్రస్తుతం సిమెంటు రేటు దాదాపు డబుల్ కాగా, స్టీలు ధరలు 113 శాతం పెరిగాయని చెప్పారు. ఇవాళ ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే దాదాపు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని వివరించారు. కాళేశ్వరానికి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. డీపీఆర్ లేదనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై, తెలంగాణ ప్రజలపై నిజమైన ప్రేమ ఉంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన లోన్లపై వడ్డీని తగ్గించాలని బీజేపీ నాయకులకు హరీశ్ రావు సూచించారు.