తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు మండిపడ్డారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను “బడా జూటా బడ్జెట్, బోగస్ బడ్జెట్”గా అభివర్ణించారు.
ఈ బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప సారాంశం ఏమీ లేదని హరీష్ రావు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేరుతో ప్రకటించిన పథకాలు కేవలం ఓట్ల కోసం మాత్రమేనని, ఆ వర్గాల అభివృద్ధికి ఉపయోగపడవని విమర్శించారు.
రెండు పంటలకు సన్న వడ్ల బోనస్ ఇచ్చామని ఆర్థిక మంత్రి అసెంబ్లీలో అబద్ధం చెప్పారని హరీష్ రావు ఆరోపించారు.“రెండు పంటలకు బోనస్ ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం.. మీరు సిద్ధమా?” అంటూ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5% ఉండగా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అది 10.7%కి పడిపోయిందని పేర్కొన్నారు.తలసరి ఆదాయం వృద్ధి కూడా తగ్గిందని, అభివృద్ధి మందగించిందని అన్నారు.హైడ్రా కూల్చివేతలు, ప్రభుత్వ నిర్ణయాలు అభివృద్ధికి అడ్డంకిగా మారాయని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం “క్యూర్, ప్యూర్, రేర్” కాదు, “చోర్ మోడల్, గోల్‌మాల్ మోడల్” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
బడ్జెట్ ప్రసంగంలో ఆరు గ్యారెంటీల గురించి ప్రస్తావన లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.ప్రభుత్వానికి ప్రజల కంటే భూములపై ఎక్కువ ఆసక్తి ఉందని విమర్శించారు.తెలంగాణను, జీహెచ్ఎంసీని విభజించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు నిరాశే మిగిలిందని, పేదల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని హరీష్ రావు ఆరోపించారు.

