సింగరేణి టెండర్ల కుంభకోణంపై మాజీ మంత్రి హరీష్

14
- Advertisement -

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి టెండర్లలో భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల మధ్య “వాటాల పంచాయతీ” నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో మరికొన్ని దిమ్మతిరిగే విషయాలు త్వరలోనే బయటపెడతామని స్పష్టం చేశారు.

నైనీ బ్లాక్ టెండర్ల రద్దుపై భట్టి విక్రమార్క చేసిన ప్రకటనను ప్రస్తావించిన హరీశ్ రావు, కాంట్రాక్టు “సైట్ విజిట్ సర్టిఫికేట్” విధానం తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడా లేదని అన్నారు. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో కూడా ఈ విధానం లేదని, రేవంత్ ప్రభుత్వం వచ్చాక 2024లోనే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత మొదటి లబ్ధిదారుడు సీఎం సన్నిహిత బంధువు సుజన్ రెడ్డి అని, ఆయనకు చెందిన శోదా కన్స్ట్రక్షన్ కంపెనీకి తొలి టెండర్ దక్కిందని ఆరోపించారు.

సాధారణంగా ఓబీ కోల్ బ్లాక్ టెండర్లు దేశవ్యాప్తంగా మైనస్‌ 10 నుంచి మైనస్‌ 22 శాతం వరకు వెళ్లడం పరిపాటిగా ఉంటుందని, గతంలో సింగరేణిలో కూడా మైనస్‌ 7 నుంచి మైనస్‌ 20 వరకు టెండర్లు ఉండేవని హరీశ్ రావు గుర్తుచేశారు. అయితే కొత్త విధానం వచ్చాక అన్ని టెండర్లు ప్లస్‌ 7 నుంచి ప్లస్‌ 10 శాతానికి కట్టబెట్టారని ఆరోపించారు. భట్టి విక్రమార్క కేవలం నైనీ బ్లాక్ టెండర్లనే రద్దు చేస్తామని చెప్పడాన్ని ప్రశ్నిస్తూ, అదే విధానంలో జరిగిన మిగతా టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు.

ఆన్‌లైన్ టెండర్ల ద్వారా దేశవ్యాప్తంగా ఎవరైనా పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ, సైట్ విజిట్ విధానం ద్వారా ముందే ఎవరు టెండర్ వేయబోతున్నారో తెలుసుకుని, వారిని బెదిరించి బయటకు నెట్టేశారని, చివరకు తమ అనుయాయులకు అధిక శాతాల్లో టెండర్లు కట్టబెట్టి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఇదే నైనీ బ్లాక్‌లో జరిగిందని, వాటాల పంచాయతీ కారణంగా గొడవలు కూడా వచ్చాయని తెలిపారు.

మరో కోణంగా, గతంలో బీఆర్ఎస్ హయాంలో పోటీ విధానంలో ఇచ్చిన టెండర్లను రద్దు చేసి, ఇప్పుడు ప్లస్‌ శాతాల్లో మళ్లీ తమ వారికి అప్పగిస్తున్నారని అన్నారు. డీజిల్ సరఫరా విషయంలోనూ గతంలో ఐఓసీఎల్ నుంచి బల్క్‌లో తీసుకునే విధానాన్ని రద్దు చేసి, కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అప్పగించారని, దీని వల్ల సింగరేణికి భారీ నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారం సీఎం అత్యంత సన్నిహితులు, బంధువుల కనుసన్నల్లోనే జరుగుతోందని, నిజంగా దమ్ము, నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు అనుమతించాలని హరీశ్ రావు సవాల్ విసిరారు. సైట్ విజిట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని, డీజిల్ విధానాన్ని పునరుద్ధరించాలని, సింగరేణికి అర్హత కలిగిన రెగ్యులర్ సీఎండీని నియమించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బొగ్గు స్కాంపై న్యాయస్థానాలకూ వెళ్లి పోరాడుతామని స్పష్టం చేశారు.

Also Read:థైరాయిడ్..బరువు పెరగడానికి కారణమా?

- Advertisement -