రాష్ట్ర ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు గారు స్పష్టం చేశారు. మంగళవారం టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులు ఆయనను కలిసి, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కార్మికుల పక్షాన నిలబడి, వారి సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన హరీశ్ రావు గారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి, కార్మికులకు చేస్తున్న అన్యాయంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను కాపాడుకోవాలని కార్మికులు పోరాడుతుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తోందని హరీశ్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాలుష్య నియంత్రణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీని కార్పొరేట్ శక్తులకు అప్పగించి, వారికే సబ్సిడీలు ఇస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రైవేట్ కంపెనీలతో ఏకంగా 2000 బస్సుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, విద్యుత్ బస్సుల ముసుగులో సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకుందని అన్నారు.కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలను నేరుగా ఆర్టీసీకే ఇప్పించి, సంస్థ సొంతంగా బస్సులు కొనుగోలు చేసుకునేలా పథకంలో సవరణలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
జీరో టికెట్ అమలు కోసం ప్రతినెలా 350 కోట్లు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇపుడు అరకొర నిధులు చెల్లించి చేతులు దులుపుకోవడం శోచనీయం. గత రెండేళ్లుగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల భారాన్ని ఆర్టీసీపైనే మోపడం వల్ల సంస్థ ఆర్థికంగా కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ రెండు పీఆర్సీలు పెండింగ్లో ఉండగా, 2025 పీఆర్సీ సైతం అమలుకు నోచుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు.
సంస్థలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (CCS)లో దాచుకున్న పొదుపు మొత్తాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గత 23 నెలలుగా వడ్డీ చెల్లించడం లేదని మండిపడ్డారు. రిటైర్మెంట్ తర్వాత ఆసరాగా నిలుస్తుందనుకున్న డబ్బు చేతికి రాక కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:వాహనాల రిజిస్ట్రేషన్ విభాగంలో మార్పులు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ‘అపాయింటెడ్ డే’ ప్రకటించకపోవడం దుర్మార్గమన్నారు. కార్మికులకు దక్కాల్సిన పదోన్నతులు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండి మండిపడ్డారు.ఉచిత ప్రయాణం పథకం సజావుగా సాగుతోందని డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వం.. రద్దీకి సరిపడా కొత్త బస్సులు కొనడంలో, సిబ్బందిని నియమించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సిబ్బంది కొరతతో ఉన్న కార్మికులపై తీవ్ర పని భారం పడుతోందని, ఆ ఒత్తిడి వల్ల కార్మికులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హరీశ్ రావు గారు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమను చూపించకుండా. తక్షణమే 2,804 కోట్ల బకాయిలను విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి. కార్మికుల సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బలంగా బీఆర్ఎస్ పక్షాన వినిపిస్తాం.. ప్రభుత్వం మెడలు వంచైనా పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

