మూసీ నది వరదలు, సుందరీకరణ పేరుతో జరుగుతున్న చర్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన సమయంలో మూసీ గేట్లను ఉద్దేశపూర్వకంగానే ఒకేసారి తెరిచారని ఆయన ఆరోపించారు. పై నుంచి వచ్చే వరద నీటిని ముందుగానే అంచనా వేసి, దశలవారీగా నీటిని కిందికి వదలాల్సి ఉండగా, ప్రాజెక్ట్ పూర్తిగా నిండే వరకు గేట్లు తెరవలేదని విమర్శించారు. ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు ఎత్తేయడంతో పరిసర ప్రాంతాల్లోని ఇండ్లు, రోడ్లు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇది యాదృచ్ఛికం కాదని, ప్రభుత్వ పెద్దలు కావాలనే చేసిన నిర్లక్ష్య చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ విషయంపై ప్రభుత్వానికి అవగాహన ఉందా? అని హరీష్ రావు ప్రశ్నించారు.
అదేవిధంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకసారి ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుకు రూ. లక్ష కోట్లు ఖర్చవుతాయని చెబితే, మరోసారి రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. అసలు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని కోరారు.
ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలను కూల్చివేశారో, వాటికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆ చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ. 14.5 లక్షలు నగదు పరిహారం, అలాగే 200 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఆ విధంగా ఇప్పటివరకు ఎంత మందికి పరిహారం ఇచ్చారో, భవిష్యత్తులో ఇస్తారా అనే అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీష్ రావు కోరారు.
Also Read:పోలీసుల అదుపులో మావోయిస్టు దేవా!

