అక్రమ మైనింగ్‌పై హరీష్‌ రావు ఫైర్

5
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తోంది మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్.

సీఎం రేవంత్ అల్లుడి అనుయాయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమి కట్టబెట్టడంపై తీవ్రంగా మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు.. మంత్రులు, వాళ్ల బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు, భూకబ్జాలు ఎందుకు కనిపించడం లేదు..వెంటనే అక్రమ మైనింగ్ నిలిపివేసి, దోచుకున్న సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయడంతో పాటు అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యు, మైనింగ్, పీసీబీ, HMDA అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదు?,రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? చెప్పాలన్నారు.

సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం? మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా?…ముఖ్యమంత్రి అల్లుడు అనుయాయులు, మంత్రి పొంగులేటి గారి సంస్థ నిర్వహిస్తున్న అక్రమ క్వారీకి సంబంధించిన ఫోటోలు, పూర్తి వివరాలను మీడియా సాక్షిగా విడుదల చేస్తున్నాను.. అయినప్పటికీ మీకు ఈ గలీజు మైనింగ్ దందా కనిపించకపోతే చెప్పండి, స్వయంగా నేనే వచ్చి చూపిస్తాను. అక్కడే నిజానిజాలు నిగ్గుతెల్చుదాం! అని డిమాండ్ చేశారు.

Also Read:దేవరకొండ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

- Advertisement -