గురుకుల విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా?

6
- Advertisement -

లియనల్ మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు రూ.100 కోట్లకు పైగా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్న ఈ ప్రభుత్వం, అదే సమయంలో గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై మాత్రం కనీస శ్రద్ధ చూపడంలేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. పిల్లల ప్రాణాలకంటే ఫుట్‌బాల్ ఈవెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి విజన్ 2047 అంటున్నాడు.. కానీ ఇది పాయిజన్ 2047..తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక మూలలో కలుషిత ఆహారంతో పిల్లలు మంచాలపై పడుతున్నారు..అస్వస్థతకు గురైన పిల్లలు తిరిగి గురుకులాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు అన్నారు.

బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా, చంద్రునాయక్ తండాలోని ప్రభుత్వ పాఠశాలలో మరో 44 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. మొత్తం 67 మంది పిల్లలు ఒక్కరోజులోనే ఆసుపత్రుల పాలయ్యారు. పలువురు విద్యార్థులు కింగ్ కోఠి, నిలోఫర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చంద్రునాయక్ తండా ఘటనలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇంత తీవ్రమైన పరిస్థితి ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి గానీ, ఇతర మంత్రులు గానీ ఒక్కరూ పిల్లలను పరామర్శించలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. “రూ.100 కోట్లతో ఫుట్‌బాల్ ఆడే బదులు, అదే డబ్బుతో మంచి హాస్టళ్లు నిర్మించి, విద్యార్థులకు కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించవచ్చు కదా?” అని ఆయన నిలదీశారు.

Also Read:భారత్‌పై సుంకాలు అక్రమం..అమెరికా ఎంపీలు!

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 116 మంది గురుకుల విద్యార్థులు మరణించారని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినంత ప్రభావం కూడా లేదని హరీష్ రావు ఆరోపించారు. వరుస ఘటనలు జరుగుతున్నా బాధ్యత తీసుకునే వారు ఎవరూ లేరని అన్నారు. పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన ప్రభుత్వం, ఇలాంటి సంఘటనలపై స్పందించకపోతే ప్రజలు తప్పకుండా ప్రశ్నిస్తారని ఆయన హెచ్చరించారు. గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, భద్రత రాజకీయాల కంటే ముందు ఉండాలన్నదే ఈ ఘటనల నుంచి వచ్చే గట్టి సందేశమని పేర్కొన్నారు.

- Advertisement -