సిద్ధిపేట అర్బన్ మండలం లింగారెడ్డి పల్లి వద్ద నిర్మించిన కొచ్చగుట్ట పల్లి భూనిర్వాసిత గ్రామంలోని 130 మంది లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయకసాగర్ రిజర్వాయర్ సమీపంలో ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రారంభించుకుంటున్న ఈ ఆర్ అండ్ ఆర్ కాలనికి రంగనాయకపురం గా నామకరణం చేసుకుంటున్నాం అని చెప్పారు.
నిర్వాసితుల త్యాగాలు వెలగట్టలేనివి వారికి సంపూర్ణ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాసితులు అందరికి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. కాలనిలో అంగన్ వాడి, మిల్క్ సెంటర్, పాటశాల, దేవాలయం, సీసీ కెమెరాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పారు.
అనంతగిరి రిజర్వాయర్ లో నిర్వాసితులందరికి చేపలపై శాశ్వత హక్కు కల్పిస్తున్నాం అన్నారు. ఈ ప్రాజెక్టుల కింద ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు మేడ్చల్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టుల్లో ఏడాది కాలం పాటు నీళ్లు ఫుల్ గా ఉంటాయి ఏడాది పొడుగునా ఉపాధి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవని… దైవ కృపతో అన్ని అడ్డంకులు దాటుకుంటూ ప్రాజెక్టులు పూర్తి చేపట్టుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే అనంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయి… రాబోయే రోజుల్లో సిద్దిపేట ప్రాంతానికి ఫుడ్ ఇండస్ట్రీ పార్కులు వస్తున్నాయి.. ఈ రంగనాయకపురంలో చదువుకున్న వారు ఉంటే వారికి ఉద్యోగాలు వచ్చేలా చూస్తా అని చెప్పారు.