బడ్జెట్ అంతా డోల్లా అని ఆధారాలతో సహా నిరూపించారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో కలిపి, ముచ్చటగా మూడు బడ్జెట్లు ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క అభినందనలు చెబుతూనే బడ్జెట్ అంతా అంకెల గారెడీని మండిపడ్డారు.
హరీష్ రావు ఏమన్నారంటే..దేశంలో అత్యధికంగా 14 సార్లు బడ్జెట్ ప్రణాళికలు రూపొందించి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు గారికి శుభాకాంక్షలు. బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని నీతులు బాగానే వల్లించారు.భట్టి గారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్, గట్టి బడ్జెటా? వట్టి బడ్జెటా? అనేది పరిశీలించే ముందు ఒకసారి గత ఏడాది బడ్జెట్ ను సమీక్షిద్దాం. వారప్పుడు ఏమన్నారు అధ్యక్షా.. • ‘పదేండ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా, ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశ పెట్టింది అన్నరు.’ (పేజీ నెం.6- గత బడ్జెట్)
• ఇది అబద్ధమో, నిజమో ఇప్పుడు తేల్చేద్దాం.
• గత ఏడాది బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లు అని గొప్పగా చెప్పుకున్నారు.
• ఇవి అవాస్తవిక అంచనాలని నేను ఆనాడే చెప్పాను.
• రివైజ్డ్ ఎస్టిమేషన్ లో 27 వేల కోట్లు తక్కువ చేసి చూపారు.
• ముఖ్యమంత్రి గారేమో ₹ 60 నుంచి 70 వేల కోట్లు తక్కువగా వస్తాయని సెలవిచ్చారు.
• అంటే అంచనా అవాస్తవం అని తేలిపోయింది.
FIRST, THEY PROMISE REFORMS, THEN THEY REFORMED THEIR PROMISES
• పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పారో గానీ కాంగ్రెస్ పార్టీకి సూటైతది.
• ఎన్నికలకు ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలనే ఏమార్చేసారు.
• ఎన్నికల ముందు ఎల్.ఆర్.ఎస్ వద్దు,
• నో ఎల్ఆర్ఎస్ – నో బీఆర్ఎస్ అన్నరు. ఉచితంగా చేస్తామన్నారు
• ఇవాళ ముక్కుపిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు.
• ఆనాడు మేం ఫార్మాసిటీకి భూములు సేకరిస్తుంటే, సీతక్క గారు, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాదయాత్ర చేసి, ఫార్మాసిటీకి పచ్చటి భూములెలా తీసుకుంటారని ప్రశ్నించారు.
• మేం అధికారంలోకి వస్తే తీసుకున్న భూములు వాపసిస్తామన్నరు.
• ఇవాళ ఫార్మాసిటీ భూములు 14 వేల ఎకరాలు వాపసు ఇచ్చుడు లేదు, ఇంకో 16 వేల ఎకరాల భూములు తీసుకుంటమని చెప్తున్నరు.
• ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని పెట్టి భూములు లాక్కుంటున్నరు.
• ఆ రోజు ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తి, అమ్మవద్దు, చనిపోతే బొంద పెట్టడానికి జాగా కూడా లేకపోతే ఎలా అన్నరు. ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముతున్నరు.
రైతులకు ఇచ్చిన వాగ్దానాలు….
15వ పేజీ: రైతుకు నిజమాఫీ జరగాలన్న ఉద్దేశ్యంతో రుణమాఫీకి అవసరమైన 31వేల కోట్ల రూపాయలు సమీకరించుకున్నం అన్నరు.
ఈసారి బడ్జెట్లో 20వేల కోట్లు మాత్రమే చేసామన్నరు. మిగతాది ఎప్పటిలోగా చేస్తారో చెప్పడం లేదు.
మరి ఇప్పుడు ఎవరికి చేతగాలేదు, ఎందుకు చేతగాలేదు. ఏమైంది భట్టి గారు సెలవియ్యాలె.
17వ పేజీ: రైతు భరోసా పేరిట ఏటా ఎకరానికి 15,000 చెల్లించాలని మా ప్రభుత్వ సంకల్పం అన్నరు.
ఏమైంది మీ సంకల్పం. ఏడ బోయింది మీ రైతు భరోసా.
పథకం పేరు మార్చారు తప్ప, 15వేలు ఇవ్వలేదు. ఈ బడ్జెట్ లో దాన్ని 12వేలకు కుదించారు.
వానాకాలం ఎగబెట్టారు. యాసంగికి 12 వేలన్నరు. అవి కూడా సగం మంది రైతులకు కూడా ఇవ్వలేదు.
Also Read:మోదీ విదేశీ పర్యటనల ఖర్చెంతో తెలుసా?
27వ పేజీ: (ఓటాన్ అకౌంట్) బడ్జెట్ లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్న భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసినం అన్నరు.
(ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్పీచ్ లో) పెట్టి చేతులు దులుపుకున్నరు.
తర్వాతనేమో రైతులు, కౌలు రైతులు చూసుకోవాలన్నరు.
ఈసారి బడ్జెట్ లో కనీసం కౌలు రైతుల ఊసే లేదు.
19వ పేజీ: ఫసల్ బీమా పథకంలో చేరినం, అమలు చేస్తం అన్నరు. రైతులకు పైసా ఖర్చు లేకుండా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నరు. మేం సంతోషపడ్డం.
బడ్జెట్ లో 1300 కోట్లు పెట్టారు. మరి ఏమైంది, ఫసల్ బీమాను అమలు చేసింది లేదు. రైతులకు కన్నీళ్లే మిగిలాయి.
మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు…
34వ పేజీ: మహిళలకు ఏడాదికి కనీసం 20వేల కోట్లు తగ్గకుండా, వచ్చే ఐదేండ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నది మా సంకల్పం అన్నరు.
ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసింది లేదు.
వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేం ఇచ్చిన 5 లక్షలకు మించి పెంచింది లేదు.
ఇదే శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా 5 లక్షల వరకే వడ్డీ అందుతుందని ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది.
5లక్షల వరకే వడ్డీ లేని రుణాలు అని మీరే అన్నరు. మళ్లీ మీరే తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం అని ప్రచారం చేసుకుంటున్నరు.
నేను భట్టి గారిని సూటిగా అడుగుతున్నా. మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి VLR వర్తిస్తుంది సీతక్క గారు చెప్పింది నిజమా, భట్టి గారు చెప్పింది నిజమా.. ఆ ఉత్తర్వులు చూపండి.
లేదా ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసిందనందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.
35వ పేజీ: స్కూల్ యూనిఫాం కుట్టు చార్జీలను జతకు రూ. 50 నుంచి రూ.75కు పెంచడం జరిగింది అన్నరు.
ఈరోజుకు ఏ ఒక్క గ్రామంలో అయినా, ఏ ఒక్క మహిళా సంఘానికి 50 రూపాయలకు మించి డబ్బులు అందలేదు. అందితే ఆ ఊరి పేరు చెప్పండి. మహిళా సంఘం పేరు చెప్పండి.
ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇచ్చిన వాగ్దానం..
27వ పేజీ: ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇండ్ల చొప్పున, మొత్తం 4,50,000 ఇండ్లు నిర్మిస్తామన్నరు. ఎస్సీ, ఎస్టీలకు 6లక్షలు చెల్లిస్తం అన్నరు.
అధ్యక్షా.. నాలుగున్నర లక్షలు కాదు కదా, ఈ 16నెలల కాంగ్రెస్ పాలనలో నాలుగు ఇండ్లన్న కట్టలేదు.
భట్టి గారు.. మీరుండడం వల్ల రూపాయి ఎక్కువ వస్తదని ఆశ పడ్డరు. ఉన్నది తీసేసిన్రు.
ఎస్సీ, ఎస్టీలకు అదనంగా లక్ష రూపాయలు ఇస్తామన్నది ఎత్తేసారు. దళితులను, గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. దగా చేసింది.
ఎస్సీ, ఎస్టీలకు అదనంగా 1 లక్ష ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం..
6వ పేజీ: ఉద్యోగ నియామక క్యాలెండర్ ను త్వరలోనే ప్రకటిస్తాం అన్నరు.
అధ్యక్షా ఏం జరిగింది. జాబ్ క్యాలెండర్ కాస్తా, జాబ్ లెస్ క్యాలెండర్ అయ్యింది.
జాబులేవి అని అడిగితే అశోక్ నగర్లో వీపులు పగలగొట్టారు.
అక్టోబర్ 2024 గ్రూప్ 1, ట్రాన్స్ కో, జెన్కో, ఏఈఈ, గెజిటెడ్ పోస్టుల నోటిఫికేషన్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నరు.
కొత్తగా ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అధ్యక్షా..
ట్రిపుల్ ఆర్..
44వ పేజీ: దీని నిర్మాణానికి తగిన భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతుంది. దాని కోసం బడ్జెట్ లో 1525 కోట్లు పెట్టాం అని భట్టిగారు
16 నెలల పాలనలో ఒక్క రూపాయి చెల్లించింది లేదు, ఒక్క ఎకరం సేకరించింది లేదు. ఒక్క కిలో మీటరైనా రోడ్డు వేశారా
2022లోనే మా ప్రభుత్వమే ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి పర్మిషన్ తెచ్చింది.
ఇరిగేషన్ రంగంలో వాగ్దానాలు..
62వపేజీ: తుది దశలో ఉన్న ఆరు ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి చేస్తం, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిస్తం అన్నరు.భట్టి గారిని అడుగుతున్నా.. ఏ ఆరు ప్రాజెక్టులు పూర్తి చేశారో ఆరు ప్రాజెక్టుల పేర్లు చెప్పండి. ఎన్ని ఎకరాల ఆయకట్టిచ్చారో చెప్పండి. అంకెల గారడీ తప్ప అమలు ఉండదా అధ్యక్షా?
బడ్జెట్ అనేది రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రం. బడ్జెట్ అంటే భరోసా,బడ్జెట్ అంటే బతుకుదెరువు. బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి. కానీ వీళ్ల బడ్జెట్లో చెప్పినవేవీ అమలు చేయకుండా అంకెల గారడీ చేశారు.అంకెలు చూస్తే ఆర్భాటం… పనులు చూస్తే డొల్లతనం.గత బడ్జెట్ కథ ఇది, ఇక వర్తమానానికి ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం..భట్టి గారు పేరా నెం. 62లో ఒక మాట చెప్పారు…ఓడ దాటే దాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినంక బోడ మల్లప్ప..ఇది కాంగ్రెస్ పార్టీకి బాగు సూటవుతది. వాగ్దానాల జాతర చేశారు. ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు.
• ఇవాళ మహాలక్ష్మి రూ. 2500 పింఛన్ – మోసం
• పింఛన్ రూ. 4 వేలకు పెంపు – మోసం
• రైతు భరోసా – మోసం
• రుణ మాఫీ – మోసం
• కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం – మోసం
• నిరుద్యోగ భృతి – మోసం
• ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు – మోసం
• ఆడ పిల్లలకు స్కూటీలు – మోసం
• 5 లక్షల విద్యా భరోసా కార్డు – మోసం
• అన్ని పంటలకూ బోనస్ – మోసం
• ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం – మోసం
• ఆటో డ్రైవర్లకు ఏటా 12 వేలు – మోసం
• వ్యవసాయ కూలీలకు ఏటా 12 వేలు – మోసం
ప్రస్తుత బడ్జెట్ (2025-26) పై…..
• ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో భట్టి గారిని ఒక జర్నలిస్టు…. ‘‘ రాష్ట్ర ఆదాయానికి – మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది. ఎలా అమలు చేస్తారు?’’ అని అడిగాడు.
• భట్టి గారు జవాబిస్తూ… ‘‘ మా కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల అనుభవం ఉంది, ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు. మా వ్యూహాలు మాకున్నాయి, ఆదాయాన్ని పెంచుతాం – హామీలన్నీ నెరవేరుస్తాం’’ అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ప్రజల్ని నమ్మించారు.
• అయితే, ఈ 15 నెలల ఆచరణలో ఏం జరిగిందో, ఏం ఒరిగిందో మనతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
• వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశ పెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూసినం.
• ఇప్పుడు మళ్లీ 3 లక్షల 4 వేల 965 కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలి మేడ కట్టారు.
• అధ్యక్షా.. ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, మోస్ట్ డిసప్పాయింట్ మెంట్ బడ్జెట్
• కాంగ్రెస్ డిజాస్టరస్ పరిపాలన రాష్ట్ర ఆదాయం మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది.
• ఆదాయం అంతకంతకూ క్షీణిస్తున్నది.
• మరిప్పుడు అనుభవం గల్ల భట్టి గారు ఏం చెయ్యాలె ? చెప్పాలె ఈ రోజు
• అయితే, తమ పాలనా వైఫల్యాలను సరిచేసుకోవాలె.
• రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం, ప్రభుత్వ భూములను తెగనమ్మాలె.
• ఎనుముల వారి పాలనలో ఎన్ని భూములు ఖతం పట్టిస్తరో..
• గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేయడం ద్వారా 30వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు
• ఇప్పటికే TGIIC భూములు తాకట్టు పెట్టి ₹10 వేల కోట్ల అప్పు తెచ్చారు.
• ఇప్పుడేమో HMDA ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20 వేల కోట్ల అప్పు తెస్తమని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు.
• HMWSS, GHMC ఆస్తులు తాకట్టు పెట్టి మరో ₹ 20 వేల కోట్ల అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
• హౌజింగ్ బోర్డు భూముల అమ్మకం ఇప్పటికే షురూ అయింది.
• నాడేమో ‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, చనిపోతే బొంద పెట్టడానికి కూడా జాగ ఉండదని’’ నాడు రేవంత్ రెడ్డి గారు సుభాషితాలు పలికిండు.
• అధికారంలోకి రాగానే అమ్మకాలు మొదలు పెట్టిండు.
• అమ్మొద్దు అని ఆక్షేపించిన నోటితోనే, భూముల అర్రాస్ పాట పాడుతున్నరు
• దీన్నే వాటం తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటరు.
• మొత్తంగా 50 వేల కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మి సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
• అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములు అమ్ముడు. ఇదే మీ మార్కు పాలన
• తన పరిపాలన నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది.
తన వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఈ మధ్య కొత్త వాదన షురూ చేశారు.
• ప్రపంచమంతా, దేశమంతటా, రాష్ట్రమంతటా ఆర్థిక మాంద్యం ఉందని చెబుతున్నరు.
• కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలోనే ఎందుకు ఉంది?
• అంతా నాకే తెలుసు అనుకునే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారి అహంకారం, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటు పడింది.
• తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని, ప్రపంచమే స్లో డౌన్ అయ్యిందని ప్రవచనాలు ప్రారంభించారు.
• ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా?
• మీ నెగిటివ్ పాలసీల వల్ల, మీ రివేంజ్ పాలిటిక్స్ వల్ల ఆదాయం కుంటుపడింది.
• రేవంత్ గారి పాదం మోపిన వేళా విశేషం ఏమో గానీ, ఆర్థిక వృద్ధి నేల చూపులు చూస్తున్నది.
1, జీఎస్టీ వృద్ది రేటులో తగ్గుదల…
• 2023-24లో జీఎస్టీ ద్వారా 46,500 కోట్లు వస్తే ఈ ఏడాది వీళ్లు ప్రతిపాదించింది. బడ్జెట్ అంచనా 58,594 కోట్లు. As per CAG Report
• అంటే 20శాతం అదనపు ఆదాయం వస్తుందని బడ్జెట్ లోచూపారు.
• ఏప్రిల్ నుంచి జీఎస్టీ వృద్ది రేటు 5.5 శాతమే.
• మీరు ఆశించింది 20శాతం వచ్చింది 5.5శాతం.
• జీఎస్టీ వసూళ్లలో కర్ణాటక 10.72శాతం వృద్ది రేటు నమోదు చేస్తే, మహారాష్ట్ర 12.18శాతం నమోదు చేసింది. దేశ సగటు 10శాతంగా నమోదైంది. ఆర్ధికమాంద్యం దేశమంతటా ఎందుకు లేదో ఇక్కడే ఎందుకున్నదో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.
• తెలంగాణ 5.63 శాతం నమోదు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
• జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి, దేశ వృద్ది రేటు కంటే తెలంగాణ వృద్ది రేటు ఎప్పుడూ తగ్గలేదు.
• మా పాలనలో మొదటిసారిగా దేశ సగటుకంటే తగ్గడం సిగ్గుచేటు. మీ పరిపాలనా వైఫల్యం.
2, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ…
• బిఆర్ఎస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది.
• పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్థిక ఉత్పాతాలను తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం.
• 2014-15లో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ ఆదాయం ₹2,822 కోట్లు.
• 2023-24 మేం దిగిపోయేనాటికి ₹14,588 కోట్లకు పెరిగింది.
• Average aggregate growth rate 25.62 శాతం
• కేసీఆర్ గారి పరిపాలన సృష్టించిన పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఇది సాధ్యమైంది.
• కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 బడ్జెట్ లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం ₹18,244 కోట్లు వస్తదని అంచనా వేసారు.
• గత 11 నెలల్లో 12,867 కోట్లు మాత్రమే
• ఈ నెల కూడా కలుపుకున్నా అది 14వేల కోట్లు దాటదు.
• అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదైంది. దాదాపు నాలుగు వేల కోట్లు అంచనా తప్పింది. మీ పాలనలో లోపం ఉంది, ఆత్మవిమర్శ చేసుకోండి
• అంచనాల్లో 77శాతం మాత్రమే చేరుకున్నం. 23శాతం అంచనా తప్పింది.
• ఇదే సమయంలో అంచనాల్లో తమిళనాడు 90%, కర్ణాటక 85%, మహారాష్ట్ర 93% చేరుకున్నాయి.
• దేశంలోని అన్ని రాష్ట్రాలు 90 అంచనాలు చేరుకుంటే, మన రాష్ట్రం 77శాతం వద్దే నిలిచిపోయింది.
ఆర్ధిక మాంద్యం ప్రపంచంలో లేదు, దేశంలో లేదు, మీ బుద్ధిలో మాంద్యం ఉంది, మీ ఆలోచనలో మాంద్యం ఉన్నది.
3, క్రమంగా తగ్గిన వెహికిల్ సేల్స్..
• 2023-24 ఆర్థిక సంవత్సరం మా పాలన ఉన్నంత వరకు వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి.
• 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగిన వాహనాల అమ్మకాల గ్రోత్ రేట్ మైనస్ 0.08 శాతానికి తగ్గిపోయింది.
• ఇదే సమయంలో ఏపీ ప్లస్ 12.81 శాతం.
• తమిళనాడు ప్లస్ 32.83, కర్ణాటక ప్లస్ 8.38, మహారాష్ట్ర ప్లస్ 12.95, కేరళ ప్లస్ 10.83 శాతం పెరిగితే మన రాష్ట్రం 0.08శాతానికి పడిపోయింది.
• తెలంగాణలో పాలనా వైఫల్యంతోనే మన రాష్ట్ర ఆదాయం క్షీణించింది.
జీఎస్టీ వృద్ది రేటులో తగ్గుదల,
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల,
వాహనాల అమ్మకాల్లో తగ్గుదల
దీనికి కారణం ఆర్థిక మాంద్యమా? ఆత్మ విమర్శ చేసుకోండి
తెలంగాణకు మాత్రమే ఇది రావడానికి పరిపాలనా వైఫల్యమే
పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే ఎందుకొచ్చింది?
ఈ తగ్గుదలకు కారణం ఆర్థిక మాంద్యం కాదు అధ్యక్షా..ఆలోచించుకోండి
నేను చాలా బాధగా చెబుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఇస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్, బట్ వేర్ ఈజ్ ఇట్ రైజింగ్.
జీఎస్టీ గ్రోత్ రేట్ డౌన్.. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్.. వెహికిల్ సేల్స్ డౌన్
ఈ ఆర్థిక క్షీణతకు అసలు కారణాలు అధ్యక్షా..
రీజన్ 1: – రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాలేదు.
రీజన్ 2- ప్రభుత్వం కొలువుదీరగానే ఫార్మా సిటీ రద్దు, ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు రద్దు అనే నెగిటవ్ ప్రచారం.
రీజన్ 3-హైడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ -పేదల ఇండ్ల కూల్చివేతలు
రీజన్ 4- మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా – సృష్టించిన భయానక వాతావరణం. పెట్టుబడులు రాలేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది.
రీజన్ 5- ఆర్ ఆర్ టాక్స్ లు
రీజన్ 6- సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకూడా దెబ్బతిన్నది.
• రైతు బంధు ఇవ్వకపోవడం,
• పంట కొనుగోలు పూర్తిగా చేయకపోవడం,
• పింఛన్లు పెంచక పోవడం,
• ఉన్న పింఛన్లు రెండు నెలలు ఎగ్గొట్టడం,
• నీళ్లివ్వక పంటలను ఎండగొట్టడం,
• చెరువుల్లో చేప పిల్లలు వదలక పోవడం,
• గొర్రెల పంపిణీ నిలిపి వేయడం,
• గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వక పోవడం,
• ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు చెల్లించక పోవడం,
• రియల్ ఎస్టేట్ కుప్పకూలడం
• ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గుతూ, ఆర్థిక వృద్ది వేగం మాంద్యం వైపు అడుగులు పడుతున్నయి.
దుష్ర్పచారం…
• ‘‘భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో.. నిజాలు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్దం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని’’ చెప్పారు అధ్యక్షా
• నేను వారి మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.
• ‘‘నువ్వు రోజూ అబద్దం ఆడితే, అది నిన్ను రేపు కూడా అబద్దం ఆడే దుస్థితికి తెస్తుంది’’ ఇది శ్రీశ్రీ గారు చెప్పిన మాట.
• మీరు అదే పనిగా చేస్తున్న అబద్దాలను పటాపంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను.
• పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం, ఛిద్రమైందనేది అబద్దం.
• ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనడం అబద్దం, బలోపేతమైందన్నది నిజం.
• పదేండ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్దం.. ఆర్థిక స్థిరత్వం సాధించిందనేది అసలు నిజం.
• దివాలా తీసిందనేది అబద్దం. దివ్యంగా ఉన్నదన్నది నిజం.
• కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం, ప్రజలకు పంచింది నిజం.
• 2013-14లో 4 లక్షల 50 వేలుగా ఉన్న జీఎస్డీపీ తొమ్మిదిన్నరేండ్లలో 15లక్షల కోట్లకు పెరిగింది. ఇది అక్షర సత్యం.
• మా పాలనలో 12శాతంగా ఉన్న జీఎస్డీపీ వృద్ది రేటు, కాంగ్రెస్ ఏడాది పాలనలో 10శాతానికి తగ్గింది.
• 1లక్షా 24వేలుగా ఉన్న తలసరి ఆదాయం మా పదేళ్ల పాలనలో 3లక్షల 56వేలకు పెరిగింది. ఇది మీరు కూడా ఒప్పుకొని, చెప్పుకుంటున్న సత్యం.
• మా పాలనలో 12.4శాతంగా ఉన్న తలసరి ఆదాయం వృద్ది రేటు మీ పాలనలో 9.6శాతానికి తగ్గింది.
• 2014-15 లో 62,306 కోట్లున్న ప్రభుత్వ వ్యయం, 2023-24 నాటికి 2,31,825 కోట్లకు పెంచాం. అనగా నాలుగు రెట్లు పెంచినం.
• సంపద పెంచినం, పేదలకు పంచినం అనడానికి ఇది నిదర్శనం.
• సొంత ఆదాయ వనరుల వృద్దిలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపాం.
• మా పాలనలో గ్రోత్ రేట్ ఆకాశం వైపు చూస్తే, మీ పాలనలో పాతాళం వైపు చూస్తున్నది.
• దివాలా తీసింది రాష్ట్రం కాదు, మీ ఆలోచనలు దివాలా. మీరు అనుసరిస్తున్న విధానాలు దివాలా. మొత్తంగా మీ పరిపాలన దివాలా ఉంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాళా తీయలేదు.
ఆవిరైపోయిన ఆరు గ్యారెంటీలు..
• కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందుకుంటూ ప్రజా జీవితం చక్కగ సాగుతున్న సందర్భం.
• స్వర్గాన్ని కిందకు దించుతామనే రీతిలో వీళ్లు హామీలు ఇచ్చిన్రు.
• ఆరు గ్యారెంటీల పేరుతో బాండు పేపర్లు ముద్రించి ఆశలు రేపిన్రు
• ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైన అంశాల మీద ప్రస్తావన లేదు, ప్రతిపాదన లేదు. దాదాపుగా చేతులెత్తేసారు.
• ఆరు గ్యారెంటీల్లో మొదటి హామి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా 2500 మహాలక్ష్మి ఊసే ఎత్తలేదు.
• మాట కూడా ఎత్తని మరో హామి, 4వేల పింఛన్
• ముసలివాళ్లు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలు తదితర 44 లక్షల నిరుపేద ఆశల్ని ఈ బడ్జెట్ అడియాశలు చేసింది.
• మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి వక్త, మంచి కళాకారుడు అధ్యక్షా…
• ఎన్నికల ముందు పల్లె పల్లెనా తిరుగుతూ ఎంతో నాటకీయంగా, డ్రమటిక్ గా వారు చెప్పిన డైలాగులు ఒక్కసారి మళ్లీ గుర్తు చేస్తున్నా..
• ‘‘వచ్చే నెలా డిసెంబర్ 9 నాడు, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. రెండు వేలు కాదు, నాలుగు వేల పించన్ వస్తది’’ అన్నడు.
• ఇంకేం అన్నడు ‘‘మనువడు వచ్చి కాళ్లు ఒత్తుతడు, పెట్రోల్ కు ఐదు వందలో, వెయ్యో అడుక్కుంటడు అవ్వా’’ అన్నడు.
• ఈ రాష్ట్రంలో 44 లక్షల మంది ఆసరా పించన్ దారుల చెవుల్లో ఈ మాటలు ఇంకా గింగురుమంటున్నయి.
• మనవడు కాళ్లొత్తడం లేదు గానీ, అవ్వా తాతలు కన్నీళ్లు ఒత్తుకొంటున్నరు.
• పింఛన్ 4 వేలు ఎప్పుడైతదా.. అని ఎదురుచూస్తూనే కొందరు కాలం చేసిన్రు
• తీరా జరుగుతున్నదేమిటి? ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కానీ, లక్ష మందికి పింఛన్లు కోత పడింది.
• ఇంట్లో ఎందరుంటే అందరికీ ఇస్తాం అని ఊదరగొట్టిన్రు
• ఇవాళ అవ్వ లేదు, తాత లేదు, 4 వేల పెన్షన్ లేదు అధ్యక్షా..
• ఇగ యువ వికాసం పేరిట రూ.5లక్షల విద్యా భరోసా కార్డు ఊసే లేదు.
• భట్టి గారు 2 బడ్జెట్లు పెట్టినా దాని ప్రస్తావనే లేదు.
• వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట 12వేలు అన్నరు. కోటి మంది కూలీలు ఉంటే లక్ష లోపే ఇచ్చ చేతులు దులుపుకొన్నరు.
• కోటి మందికి ఇవ్వాలంటే 12వేల కోటక్లు కావాలి. గత బడ్జెట్ లో 906 కోట్లు పెట్టారు. 300 కోట్లు కోత పెట్టి ఈ బడ్జెట్ లో 600 కోట్లకే కుదించారు.
• కూలీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అధ్యక్షా..
• బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినయి.
• గాంధీలిచ్చిన వాగ్దానాలు గాలి మాటలే అయినయి.
• ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు గానీ, అందాల పోటీలు పెడుతరట.
• మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టున్నది
• 2 బడ్జెట్ల తర్వాత ఆరు గ్యారెంటీల మీద చేతులెత్తేశారు.
• ఆరు గ్యారెంటీల విషయంలో మీ వైఖరి ఎట్లుందంటే..
ఆత్మ శుద్ది లేని ఆచారమదియేలా
భాండ శుద్ది లేని పాకమేలా
చిత్తశుద్ది లేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినురవేమా
మీ ఆరు గ్యారెంటీల అమలు తీరు చిత్తశుద్ది లేని శివపూజ లెక్కనే ఉన్నది.
వ్యవసాయం…
• రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త దశ దిశనిచ్చింది బీఆర్ఎస్
• ఇవాళ 2 లక్షల 60 వేల టన్నుల ధాన్యం పండిందని సీఎం గారు ఘనంగా ప్రకటించారు.
• ఈ ఘనత వెనుక బీఆర్ఎస్ చేసిన కృషిని ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారు.
• అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. తప్పుడు ప్రచారాలతో సత్యాన్ని దాచలేరు.
• 2014 -15లో సాగు విస్తీర్ణం ఎంత? కేవలం 131 లక్షల ఎకరాలు.
• తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఈ విస్తీర్ణం 221 లక్షల ఎకరాలకు పెరిగింది.
• రికార్డు స్థాయిలో అంటే 68 శాతం పెరిగింది.
• ఎట్ల పెరిగింది? మంత్రమేస్తే పెరిగిందా? మాయ చేస్తె పెరిగిందా?
• సాగు విస్తీర్ణం పెరగడం వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ, అభివృద్ధి ప్రణాళిక కీలక పాత్ర పోషించింది.
• వ్యవసాయ స్థిరీకరణ కోసం కేసీఆర్ గారు ఐదంచెల వ్యూహం అమలు చేశారు.
• పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం, పెద్ద ఎత్తున కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్దరణ, పెద్ద ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణంతో సాగు నీటి వసతులు అభివృద్ది చేసినం.
• కరెంటు కోతల కష్టాలకు తెరదించి, రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినం.
• ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి రైతు బంధు పథకాన్ని ప్రారంభించి, అమలు చేశారు కేసీఆర్ గారు.
• ఐక్య రాజ్య సమితి సైతం ప్రశంసించిన ఈ పథకం కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ కు కూడా మార్గదర్శనం అయింది.
• బిఆర్ఎస్ హాయంలో 73వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి, సరికొత్త రికార్డు నెలకొల్పింది.
• వరి నుంచి జొన్నల దాకా పండిన ప్రతి పంట చివరి గింజ దాకా కొనుగోలు చేసినం.
• ఏ రైతైనా, ఏ కారణంతో అయినా మరణిస్తే వారి కుటుంబాలు ఆగమై పోకుండా 5లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చినం.
• బిల్లులు లేకుండా కరెంటు ఇచ్చినం, పన్నులు లేకుండా సాగు నీరు అందించినం.
• ఇట్ల ఇంకెన్నో చేసినం.. అధ్యక్షా..
• బీఆర్ఎస్ హాయంలో ఏం చేయకుండానే సాగు విస్తీర్ణం దానికదే పెరిగిందని ఈ ప్రభుత్వం సత్యదూరమైన ప్రచారం చేస్తున్నది.
• చెప్పే వాడికి చెవుడైనా.. వినే వాడికి వివేకం ఉంటుంది అధ్యక్షా.
• బీఆర్ఎస్ కృషి వల్ల సాగు విస్తీర్ణం పెరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతున్నది.
• పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుపోతుంటే నీళ్లు నమిలినారు తప్ప నిరోధించలేకపోయారు.
• పెరిగిన సాగు విస్తీర్ణం బీఆర్ఎస్ ఘనత
• ఎండిపోయిన పొలాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం
• ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెబుతారు అంటే ఎండల వల్ల పంట ఎండిపోతున్నదట.
• పంటలు ఎండుతున్నది ఎండల వల్ల కాదు, ఈ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం వల్ల.
• ఈ సంవత్సరం వానలు సమృద్దిగా కురిసాయి, నదీ జలాల్లో ప్రవాహాలు పెరిగాయి.
• కానీ నీళ్లను ఒడిసి పడ్డడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలైంది.
• ఎంత దారుణం అంటే అధ్యక్షా..
• దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి 6 కోట్ల ఓ అండ్ ఎం బిల్లులు చెల్లించక 600 కోట్ల విలువైన పంటల వరంగల్ జిల్లాలో ఎండింది.
• 35 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభించారు.
• ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు.
• రైతుబంధు ఇప్పుడైతే 10 వేలే, మేమొస్తే 15 వేలిస్తం అని ఊరించిన్రు
• ఎనుముల వారిని నమ్ముకుంటే ఏం ఒరిగింది. ఎగవేతే మిగిలింది అధ్యక్షా.
• వానాకాలం రైతుభరోసా పూర్తిగా ఎగ్గొట్టారు.
• యాసంగిలో కూడా 15వేలు ఇవ్వాల్సిన భరోసా 12వేలకే కుదించారు.
• అది కూడా కొందరి రైతుల ఖాతాల్లోనే వేసారు.
• రైతు కూలీలకు భరోసా లేదు, కౌలు రైతుల ప్రస్తావన లేదు.
• చేతిగుర్తు వారి చేతగాని పాలనలో రైతు మళ్లీ అప్పుకోసం చేయి చాపాల్సి వస్తున్నది అధ్యక్షా..
• ఇగ రుణమాఫీ… అదొక దారుణ విషాద గాథ
• స్టేట్ లెవల్ బ్యాంకర్ల మీటింగ్ లో సంపూర్ణ రుణమాఫీకి కావాల్సంది. 49,500 వేల కోట్లుగా చెప్పారు.
• ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుపుకట్టుకుంటే 41 వేల కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చని ఆరోజు చెప్పారు.
• భట్టి గారి గత బడ్జెట్ ప్రసంగంలో 31వేల కోట్ల రుణమాపీ చేస్తామని చెప్పారు.
• ఈ బడ్జెట్ లోనేమో 20 వేల కోట్లు ఇచ్చాం అంటున్నరు. కానీ వాస్తవానికి అది 15, 16 వేల కోట్లు కూడా చేరలేదు.
• వాస్తవం ఏమిటంటే, రైతు ఇంటికి, బ్యాంకుకు మధ్య తిరుగుతూనే ఉన్నరు
• చివరకు రైతుకు మిగిలింది ఒడువని దు:ఖం, తీరని అప్పు
• అధ్యక్షా ఇంకా బాగా అర్థం కావాలంటే నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితే ఉదాహరణగా చెబుతా…
• బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు 43,363 మంది
• రుణమాఫీ అయ్యింది కేవలం 20,514 మంది.
• రుణమాఫీ కాని రైతులు 22,849
• అంటే ఫైనల్ గా రుణమాపీ అయిన రైతుల సంఖ్య తక్కువ,
• రుణమాఫీ కాని రైతుల సంఖ్యే ఎక్కువ.
• ఇందులో 2 లక్షల లోపు కానివారు 10,212 ఉండటం గమనార్హం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్.
• రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న వారు మీదున్నది కట్టండి. మిగతాది మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు.
• ఆయన మాటలునమ్మి చాలా మంది రైతులు అప్పు తెచ్చి పైసలు కట్టిన్రు అధ్యక్షా.
• మా నియోజకవర్గవంలోని గుర్రాలగొంది గ్రామంలో దమ్మర్ పల్లి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు యూబిఐ బ్యాంకులో 30th August, 2024 నాడు రెండు లక్షల మీదున్న 50వేలు కట్టిండు.
• నారాయణ రావు పేటకు చెందిన జి సత్తి రెడ్డి అనే రైతు 2.60లక్షల రుణం ఉంటే, మిత్తితో కలిపి యూబిఐ బ్యాంకులో మీద 76వేలు కట్టిండు.
• బంజేరుపల్లికి చెందిన మరో రైతు అక్తర్ ఖుస్రో 2లక్షల 600 అప్పు ఉంటే, మిత్తితో కలిపి మీదున్న 10వేలు కట్టిండు. వారికి ఈరోజు వరకు కూడా రుణమాఫీ కాలేదు, అప్పులే మీద పడ్డయి.
• ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి అధ్యక్షా.
• దయచేసి చేతులు జోడించి ప్రార్థిస్తున్నా..
• ఈరోజుకూ వారికి రుణమఫీ కాలేదు, ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదు.
• ఇంత చర్చ ఎందుకు భట్టి గారు..
• మీ మధిరకు పోదామా? లేదా మా సిద్దిపేటకు వస్తారా?
• ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో మీరే చెప్పండి.
• సంపూర్ణ రుణమాఫీ జరిగి ఉంటే క్షమాపణలు చెప్పడానికి నేను సిద్దం? మీరు సిద్దంగా ఉన్నారా?
• ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ అవుతుందన్నారు. ఇవాళ కడుపు కట్టుకోనిది ఎవరో, అవినీతికి పాల్పడిందెవరో తెలుస్తున్నది అధ్యక్షా..
నీటిపారుదల రంగం…
• గత మీ బడ్జెట్ లో ఆరు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం అన్నరు, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నరు.
• అధ్యక్షా.. ఒక వేళ పూర్తి చేస్త ఏ ప్రాజెక్టు పూర్తి చేసారు. ఎక్కడ నీల్లు ఇచ్చారో చెప్పండి. ఎన్ని ఎకరాలకు ఇచ్చారో చెప్పండి.
• మీ 15నెలల పాలనలో పెద్ద వాగు ప్రాజెక్టు కొట్టుకు పోయింది, ఎస్ ఎల్ బీ సీ కూలిపోయింది. వట్టెం పంప్ హౌజ్ మునిగి పోయింది. సాగర్ ఎడమ కాల్వకు గండి పడ్డది. సుంకిశాల కుప్ప కూలింది.
• భట్టిగారు బడ్జెట్ ప్రసంగంలో 511 టిఎంసీలు ఏపీకి అప్పగించినం అని చెప్పారు.
• అధ్యక్షా ఈ 299:511 ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఏపీలో మీరు రాసుకున్న అగ్రిమెంటులోనే ఉంది.
• దీనిపై సంతకాలు చేసింది మీరు ఈరోజు ఇరిగేషన్ అడ్వయిజర్ గా పెట్టుకున్న ఆదిత్యనాథ్ దాస్ గారు, జోషి గారు.
• నాటి మీ కాంగ్రెస్ పాలనో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, కేవలం 299 టీఎంసీల నీటి కేటాయింపులు జరపడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది.
• అయినా ఈ ఒప్పందం పూర్తిగా తాత్కాలికం. (కాపీ)
• ఈ ఏడాది మీరు కూడా ఇదే 299:511 సంతకాలు పెట్టి వచ్చారు కదా. (కాపీ)
• 299 టీఎంసీ నీళ్లను కూడా వాడకుండా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. పంటలు ఎండగొట్టింది.
• దీనంతటికి శాశ్వత పరిష్కారం సెక్షన్ 3
• కేసీఆర్ గారు తన శక్తి యుక్తులను ఉపయోగించి సెక్షన్ 3 సాధించారు
• సెక్షన్ 3 ద్వారా కృష్ణా నదీ జలాల పున:పంపిణీకి ట్రిబ్యునల్ ను సాధించారు.
• సెక్షన్ 3 ద్వారా తెలంగాణకు 575 టీఎంసీల నీటిని శాశ్వతంగా సాధించడానికి మార్గం సుగమం అయ్యింది.
• మీకు తెలంగాణ నీటి ప్రయోజనాల మీద చిత్తశుద్ధి, శ్రద్ద ఉంటే, ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించండి.
• తెలంగాణ హక్కుగా రావాల్సిన న్యాయబద్దమైన నీటి వాటాను రాబట్టండి.
గురుకులాలకు గ్రహణం
• రాష్ట్రంలో మీ 15నెలల పాలన ఒక్కో వ్యవస్థను దారుణంగా విధ్వంసం చేస్తున్నది.
• వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.
• హైడ్రా విధ్వంసం వల్ల పేద మధ్య తరగతి జనం గుండె ఆగి చనిపోతున్నరు
• రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
• ఉపాధి దెబ్బతిన్న ఆటోడ్రైవర్లు తమను తాము బలి చేసుకుంటున్నారు.
• చివరకు గురుకులాల్లో చదువుకుంటున్న చిన్నారులు కలుషిత ఆహారం తిని మరణిస్తున్నారు.
• ఈ అమానుష పరిస్థితులకు మీదే బాధ్యత రేవంత్ రెడ్డి.
• ఎందుకంటే మీరే ముఖ్యమంత్రివి, మీరే హోం మంత్రివి, మీరే సోషల్ వేల్ఫేర్ మంత్రి, మీరే విద్యా మంత్రివి.
• తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులాల సంఖ్య 289 నుంచి 1020కి పెంచారు. గురుకుల విద్యను బలోపేతం చేసారు.
• విద్యార్థుల సంఖ్య 1 లక్షా 50వేల నుంచి ఆరు లక్షలకు పెరిగింది.
• కానీ నేడు గురుకులాల పరిస్థితి చూస్తే.. గుండె తరుక్కు పోతున్నది.
• 15 నెలల కాంగ్రెస్ పాలనలో 83 మంది అమాయక గురుకుల విద్యార్థులు మరణించారు.
• ఇంత కన్నా దౌర్భాగ్యం వేరే ఉంటుందా?
• గురుకులాల ఎంట్రెన్స్ టెస్ట్ రాయడానికి 1 : 5 పోటీ ఉండేది. ఇవాళ విద్యార్థులు సంఖ్య లక్షా 20వేల నుంచి 74వేలకు పడిపోయింది.
• సంఖ్య తగ్గిందంటే మీ పాలన ఎట్లుందో అర్థమవుతుంది.
ప్రభుత్వ పాఠశాలలు..
• కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి విద్యా సంవత్సరంలో 1913 ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయి
• ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది
• చదువు సంగతి తర్వాత, బతికి ఉంటే చాలని టీసీలు తీసుకుపోతున్నరు.
• ఎన్నికల ముందు 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ అన్నరు.
• అధికారంలోకి వచ్చాక మేం ఇచ్చిన నోటిఫికేషన్ కు 5వేలు మాత్రమే పెంచి దగా డీఎస్సీ చేసారు.
ఫీజు రీయింబర్స్ మెంట్…
(ఓటాన్ అకౌంట్.. పేరా 71, పేజీ 34)
• ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలబాలికలకు స్కాలర్స్ షిప్స్ సకాలంలో అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నమని ఘనంగా ప్రకటించారు.
• సకాలం అంటే ఏమిటి అధ్యక్షా. 15నెలల్లో ఒక్క రూపాయి ఇవ్వకపోవడమా? ఇదేనా మీకు దళిత, గిరిజన, బీసీ విద్యార్థుల మీదున్న ప్రేమ?
• పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి విపత్తులు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం 18,500 కోట్లు ఫీజ రియిబర్స్ మెంట్ రూపంలో చెల్లించింది.
• మాటల్లో గ్రీన్ ఛానెల్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు నిధులివ్వడంలేదు.
విదేశీ విద్య…
• పేద, బలహీన వర్గాల పిల్లలు సైతం విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని, 20లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్
• ఎస్సీ, ఎస్టీలకు – అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ఇచ్చినం
• బీసీలకు- జ్యోతిరావు పూలే ఓవర్సిస్ స్కాలర్ షిప్స్ ఇచ్చినం.
• మైనారిటీలకు – సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ఇచ్చినం
• బ్రాహ్మణులకు – వివేకానంద ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ఇచ్చినం
• ఒక్కొక్కరికి 20లక్షల చొప్పున, 6,600 మందికి వెయ్యి కోట్లకు పైగా అందించినం.
• మీ పాలనలో ఇప్పటికే విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు రెండో ఇన్ స్టాల్ మెంట్ రాక చదువులు మధ్య లోనే ఆపే పరిస్థితి.
• వీటన్నింటికీ పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం.
ఉద్యోగ నియామకాలు
• భట్టి గారి బడ్జెట్ నిరుద్యోగులు ఎన్నో ఆశలు వమ్ము చేసింది.
• మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు మొండి చెయ్యి చూపారు.
• ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన వారి ఆశల మీద భట్టి గారు బకెట్ల కొద్దీ నీళ్లు చల్లారు.
• ఎన్నికల ముందు రేవంత్ నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ చుట్టూ ప్రదక్శిణ చేశారు.
• ఉద్యోగాలిచ్చి మాట నిలబెట్టుకుంటామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు
• ఏం చేశారు. ఊరూరు బస్సు యాత్రలు చేసి రెచ్చగొట్టారు.
• నిరుద్యోగులను మీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇల్లిల్లూ తిప్పారు.
• నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారు.
• ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్కలేదని దుష్ర్పచారం చేసారు.
• తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నిధులు, నీళ్లు, నియామకాలు నెరవేర్చిన ప్రభుత్వం మాది.
• తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. ముల్కీ రూల్స్ నుంచి 610 దాకా తెలంగాణ పోరాడింది దేని కోసం?
• స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని.
• మా ఉద్యోగాలు మాకు కావాలని.
• ఢిల్లీకి తిరిగి తిరిగి దాన్ని సాధించిండు కేసీఆర్ గారు.
• 60-80 శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్ ను 95శాతానికి పెంచిండు.
• అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిండు.
• ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్
• తొమ్మిదిన్నరేండ్ల బిఆర్ఎస్ పాలనలో అక్షరాల 1 లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేసినం.
• ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ తప్పుడు విషప్రచారం మానుకోండి.
• అబద్దమే మీ ఆత్మ. అబద్దమే మీ పరమాత్మ.
• ఇదే కాదు మీ జాబ్ క్యాలెండర్ సంగతి తెలుసు, 57 వేల ఉద్యోగాల ఇచ్చామని చెబుతున్నారు అధ్యక్షా..
• ఉదాహరణకు కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియ చూద్దాం..
• 17,516 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25, 2022 నాడు నోటిఫికేషన్ వేసాం
• వీరికి ఆగస్టు 28, 2022న ప్రిలిమినరీ టెస్టు, డిసెంబర్ 8, 2022న ఫిజికల్ టెస్టు, ఏప్రిల్ 23, 2023 ఫైనల్ రిటన్ టెస్ట్ ఎగ్జాం కండక్ట్ చేసినం.
• సెలక్షన్ లిస్టు అక్టోబర్ 4, 2023 నాటికి పూర్తి చేసాం.
• ఎన్నికల కోడ్ కారణంగా నియామకపత్రాలు ఇవ్వలేకపోయాం.
• అధికారంలోకి వచ్చిన మీరు ఫిబ్రవరి ఫిబ్రవరి 14, 2024న ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు పంచిన్రు.
• నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు, పరీక్ష పెట్టింది ఎవరు, ఫిజికల్ టెస్టు పెట్టింది ఎవరు, సెలక్షన్ లిస్టు చేసింది ఎవరు.
• నియామకపత్రాలు ఇచ్చి, ప్రచారం చేసుకున్నది ఎవరు. రేవంతు విధానం ఎట్లుందంటే, వంటంత అయినంక గంటె తిప్పినట్టుంది.
బీసీల సంక్షేమం..
• ఏడాదికి 20వేల కోట్లు బీసీ సబ్ ప్లాన్ కింద పెడుతామని, 42శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ఊదరగొట్టారు.
• మొదటి బడ్జెట్ లో ఏమి చేయలేదు, రెండో బడ్జెట్ లోనూ నిరాశే..
• ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం 11వేల కోట్లు అధ్యక్షా.
• వంద రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని మాట ఇచ్చి తప్పారు.
• ముదిరాజులు, గంగ పుత్రలుకు ఉచిత చేపల పిల్లలు ఇచ్చి ఉపాధి పెంచెంది కేసీఆర్
• 650 కోట్లతో మత్సకారులకు పనిముట్లు ఇచ్చింది కేసీఆర్
• కేసీఆర్ గారు ఉపాధి పెంచితే, ఈ ప్రభుత్వం ఉపాధి కోల్పోయేలా చేస్తున్నది.
• నాయిబ్రహ్మణులు, రజకులకు కేసీఆర్ గారు ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకం అమలు ప్రశ్నార్థకమైంది.
• 15నెలల నుంచి నిధులు విడుదల చేయక గోస పుచ్చుకుంటున్నది.
• నాడు కేసీఆర్ గారు గౌడన్నలకు మేలు చేయడం కోసం చెట్టు పన్ను రద్దు చేసారు.
• పాత బకాయిలు రద్దు చేసారు.
• వైన్ షాపుల్లో 15శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.
• మా ప్రభుత్వం నీరా కేఫ్ పెట్టి గౌడన్నలకు ఉపాధి కల్పిస్తే, ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కల్లు డిపోలపై దాడులు చేసి ఉపాధి లేకుండా చేస్తున్నది.
• గౌడన్నలను జైలు పాలు చేస్తున్నారు.
• కులానికో కార్పొరేషన్ పెట్టారు. చైర్మన్ పదవులు ఇచ్చారు.
• కానీ ఆ కార్పొరేషన్లకు నిధులు లేవు, విధులు లేవు
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం..
• గత బడ్జెట్ లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద 33,127 కోట్లు కేటాయిస్తే, డిసెంబర్ నాటికి 9,824 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు.
• అంబేద్కర్ అభయహస్తం పేరిట దళిత కుటుంబాలకు 12 లక్షల చొప్పున ఇస్తామన్నరు.
• అంబేద్కర్ పేరు మీద పెట్టినందుకున్నా అమలు చేయండి భట్టి గారూ..
• దళిత బంధు కింద గతంలో మంజూరైన వారికి నిధులు ఇవ్వకుండా గోస పెడుతున్నరు.
• దళిత బంధు పథకాన్ని ఒక్కరికీ ఈ ప్రభుత్వం అందించలేదు.
• ఏడాది కాలంలో దళితుల సంక్షేమం కోసం ఏ ఒక్క కార్యక్రమం ప్రారంభించలేదు. ఒక్కరికీ సాయం అందించింది లేదు.
• భట్టి గారూ.. బడ్జెట్ లో అంబేద్కర్ కొటేషన్లు బాగానే చెప్పారు. సంతోషం. కానీ ప్రపంచంలో అతి పెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రజలకు వెళ్లకుండా తాళం ఎందుకు వేసారో కూడా చెప్తే బాగుంటది.
• కేసీఆర్ గారు.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచిండు.
• ఇచ్చిన మాట ప్రకారం, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిండు
• పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు.
• ఈ ప్రభుత్వం గత బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు పక్క భవనాలు నిర్మిస్తమని చెప్పి ఒక్క భవనం కూడా నిర్మించలేదు.
• చివరికి అద్దె బకాయిలు కూడా ఇవ్వకపోతే ఓనర్లు తాళాలు వేసే పరిస్థితి.
• గత బడ్జెట్ లో ఎస్టీ ఎస్ డీ ఎ ఫ్ కింద 17,005 కోట్లు పెట్టి, డిసెంబర్ నాటికి 6వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది.
• మైనార్టీలకు ఇదే పరిస్థితి.
• గత బడ్జెట్ లో 3003 కోట్లు పెట్టామని ఘనంగా చెప్పారు. కానీ వెయ్యి కోట్లు కూడా విడుదల చేయలేదు.
• కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడం వారిని అవమానించడమే.
• మైనార్టీ శాఖకు మంత్రి లేడు, మైనార్టీ సంక్షేమానికి నిధులు లేవు
• కేసీఆర్ ఇచ్చిన రంజాన్ తోఫా మాయం
• షాదీ ముబారక్ కింద తులం బంగారం మాయం
• ఓవర్సిస్ స్కాలర్ షిప్స్ ఆగమైనయి.
• కేసీఆర్ గారు 203 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్య అందించారు.
• ఈ బడ్జెట్ లో వాటిని రద్దు చేస్తామని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో వాటిని విలీనం చేస్తామని ప్రకటించారు.
పంచాయతీ రాజ్..
• భట్టి గారు బడ్జెట్ లో.. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నరు.
• గాంధీ గారు చెప్పిన నినాదాన్ని భట్టిగారు గొప్పగా చెప్పారు.
• ఆచరణలో ఏం జరుగుతుంది.? పల్లెలకు పోదామా?
• కేసీఆర్ పాలనలో నిజమైన గ్రామ స్వరాజ్యం ఏర్పడితే, 15నెలల్లో ఆ వాతావరణాన్ని కలుషితం చేసింది మీరు.
• మేం తండాలను పంచాయతీలుగా చేసినం, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి, గ్రామ పంచాయతీల బాగు కోసం నెలా నెలా నిధులిచ్చినం
• మేం ప్రతి నెలా పల్లె ప్రగతికి 277 కోట్లు, పట్టణ ప్రగతికి 174 కోట్లు ఇచ్చినం. ఈ ప్రభుత్వం వచ్చాక బంద్ అయింది.
• కానీ మీరేం చేసిన్రు.. సాఫీగా సాగే పాలనను ఆగం చేసిన్రు
• గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకిచ్చే నిధులు బంద్ చేసిన్రు
• బిల్లులు రాక సర్పంచులు, మాజీ సర్పంచులు ఆత్మహత్యా యత్నం చేసుకున్నరు
• రాస్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిదులు విడుదల చేయకపోవడం వల్ల ప్రతి పంచాయతీ సెక్రెటరీ కనీసం లక్ష నుంచి 10లక్షల వరకు అప్పుల పాలయ్యారు.
• అప్పుల్లేని పంచాయతీ సెక్రటరీలు లేరు, వాళ్లు ఇంటి కోసం చేయలేదు అధ్యక్షా…
• ప్రభుత్వ నిధులు రాక పంచాయతీలను నడపడానికి అప్పులు చేసిన్రు అధ్యక్షా..
• కొంత మంది అప్పుల బాధ తట్టుకోలేక సెలవు పెట్టి వెళ్లి పోతున్నారు.
• 2014లో ఆనాడు గ్రామ పంచాయతీల్లో 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి… మేం ప్రతి ఊరికీ ట్రాక్టర్ ఇచ్చి, 12,941 వరకు పెంచినం
• ఇవాళ ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ లేని గ్రామ పంచాయతీయే లేదు
• పాలనా సంస్కరణల్లో 8690 పంచాయతీలను 12,941 చేసినం
• దేశ వ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ఇస్తే, 2022లో 20 అవార్డులకు గాను 19 అవార్డులు తెలంగాణకే వచ్చాయి.
• 2023లో 13 అవార్డులు వచ్చినయి.
• అధ్యక్షా.. కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే, 2024లో ఒక్క అవార్డు మాత్రమే వచ్చింది. ఇంతకంటే ఇంకేం చెప్పాలి?
వైద్యారోగ్య శాఖ…
• ఈ శాఖ గురించి చెబితే రామాయణం, రాస్తే భారతం
• పద్దుల్లో మాట్లాడుతం,సమయం తక్కువ
• రాజీవ్ ఆరోగ్య శ్రీని 5 నుంచి పది లక్షలకు పెంచాము అన్నారు సంతోషం.
• ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించాం.
• ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5లక్షలు పైన ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారి సంఖ్య 200 మంది లోపు మాత్రమే, 12 కోట్లకు మించి ఖర్చు పెట్ట లేదు.
• బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 5 లక్షల నుంచి పది లక్షల వరకు 607 మందికి 40 కోట్లతో చికిత్స అందించాం.
• అధ్యక్షా మేము చేసింది ఎక్కువ చెప్పుకున్నది తక్కువ.
• మీరు చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది.
ఆర్ అండ్ బి…
• భట్టి గారు మాట్లాడుతూ హ్యాం (హైబ్రిడ్ యాన్యుయిటీ మోడల్) మోడల్ తెస్తున్నాం అన్నరు.
• టోల్ గేట్లు నేషనల్ హైవేల్లో చూస్తుంటాం.
• ఇప్పుడు గ్రామాల్లో ప్రయాణించాలంటే కూడా టోల్ చెల్లించాల్సిందే
• 40-60 మోడల్ లో ప్రభుత్వం, కాంట్రాక్టర్ రోడ్లు నిర్మిస్తారు.
• కాంట్రాక్టర్ల 40శాతం ఎలా చెల్లిస్తారో భట్టి గారు చెప్పాలి.
ఫైనాన్స్.. గణాంకాలు..
• మీ ప్రభుత్వం ఇచ్చిన Statement of Fiscal Policy Form D – 5 పేజీ 14 ప్రకారం, ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వని రుణాలు (కార్పొరేషన్లే కట్టుకునే రుణాలు) ఈ Outstanding risk weighted guarantees కిందికి రావని చెప్పారు.
• మీరిచ్చిన వైట్ పేపర్, భట్టిగారు పెట్టిన ప్రకారం, మీరిచ్చిన Socio Economic Outlook Page No. 36 ప్రకారం, Outstanding risk weighted guarantees Form D-5 in statement of Fiscal Policy Page 14 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే అప్పు లక్షా 15 వేల 599 కోట్లు మాత్రమే ఉంటుంది.
• 5శాతం వెరీ లో రిస్క్ కింద 89 వేల 569 కోట్లు ఉంటుంది. ఈ డబ్బును ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినా… కార్పొరేషన్లే చెల్లించేవి. పోనీ మీరు చెప్పిన ప్రకారం 5శాతం రిస్క్ వెయిట్ తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే.
• ఫామ్ డీ-5 ప్రకారం SPV ల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు కేవలం 1 లక్షా 20 వేల 77 కోట్లు మాత్రమే.
• మీరు వైట్ పేపర్ లోనూ చూపించిన నాన్ గ్యారెంటీడ్ లోన్స్ 59 వేల 996 కోట్లు ఫామ్ డీ-5 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కావు.
• బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో ఎఫ్ఆర్.బీఎం పరిధిలో తీసుకున్న అప్పు 3 లక్షల 1 వెయ్యి 897 కోట్లు
• దీనికి 1 లక్షా 20 వేల 77 కోట్లు కార్పొరేషన్ అప్పును జమచేస్తే, మొత్తం అప్పు 4 లక్షల 22 వేల 674 కోట్లు.
• ఇదే సభలో నేను మాట్లాడుతూ 4 లక్షల 17 వేల కోట్ల అప్పు మాత్రమే అని చెప్పిన. 5శాతం రిస్కు ఉంటదని మీరే చెప్పారు కదా..
• ఇది నేను చెప్పిన లెక్క కాదు అధ్యక్షా.. మొన్న శాసనసభలో పెట్టిన లెక్కల ప్రకారం, వైట్ పేపర్ ప్రకారం, సోషియో ఎకనామికస్ సర్వే ప్రకారం,
• ఈ వివరాలను మీ ద్వారా ఆర్థికమంత్రి గారికి అందిస్తున్నా..
• ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి, ఇతర మంత్రులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను 4 లక్షల 22 వేల కోట్లుగానే చెప్పండి.
• బట్ట కాల్చి మీదేసి దివాళా అని ప్రచారం చేస్తే రాష్ట్రానికి నష్టం.
Form D -5
Outstanding risk weighted guarantees (Rs in Crores)
Default probability Risk Weights (%) Amount outstanding during BRS Government risk weighted guarantees
Direct liabilities 100% 1,15,599 1,15,599
High Risk 75%
Medium Risk 50%
Low Risk 25%
Very Low Risk 5% 89,569 4,478. 45
Total Out Standing 1,20,077. 45
• Excluding Non-Guarantee Loans which are paid by corporations
Total FRBM Loan during BRS govt 3,01,897 Crores
Total Outstanding weighted average 1,20,077 Crores
Total Loans in BRS Govt as per D-5 4,22,674 Crores
(3,89,673 – 72,658 – 15,118 = 3,01,897 Crores )
జీఎస్టీ లెక్కలు :
• 10 నుంచి 12 శాతం గ్రోత్ రేటును తీసుకుంటే జీఎస్టీ అంచనాలు 2024-25కు గాను 49 వేల కోట్లు మించకూడదు.
• కానీ, 2024-25 బడ్జెట్ లో మీరు 58 వేల 594 కోట్లు పెట్టుకున్నారు. మీ రివైజ్డ్ అంచనాలు కూడా 53 వేల 665 కోట్లు పెట్టుకున్నరు.
• ఈ సంవత్సరం కాగ్ రిపోర్టులను పరిశీలిస్తే ఫిబ్రవరి వరకు, 11 నెలలలో కేవలం 5.66శాతం వృద్ధిరేటు మాత్రమే జీఎస్టీలో కనపడుతుంది. ఈ ప్రకారం జీఎస్టీ రాబడి 49 – 50 వేల కోట్లు దాటదు.
• అంటే మీరు లక్ష్యంగా పెట్టుకున్న దాంతో పోలిస్తే 7 -8 వేల కోట్లు తక్కువగా రాబడి ఉండబోతోందని స్పష్టమైంది.
• దీన్ని గమనించి అయినా 2025-26 కు గాను రియలిస్టిక్ గా జీఎస్టీ అంచనాలు ఉంటాయనుకుంటే మళ్లీ అదేవిధంగా ఎక్కువ చేసి 59 వేల 704 కోట్లుగా పెట్టుకున్నరు.
• అధ్యక్షా.. జీఎస్టీ రాబడి 54 – 55 వేల కోట్లకు మించదు. మళ్లీ ఓ 4 -5 వేల కోట్లు ఎక్కువగా పెట్టుకున్నరు.
• స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ :
• స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా 2023-24కు 14 వేల 295 కోట్లు రాబడి వచ్చింది.
• బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో Annual Average Growth (AAG) 25శాతం గ్రోత్ రేటు ఉండేది. 25శాతం గ్రోత్ రేట్ అంచనాలతో మీరు 18 వేల 228 కోట్లు పెట్టుకున్నరు.
• కానీ, మీ తప్పుడు నిర్ణయాలతో మేము 2023-24లో సాధించిన దానికంటే 2024-25లో తక్కువ వచ్చే అవకాశం ఉంది
• దీనికి కారణం మీ హైడ్రా, మూసీ పేరిట కూల్చివేతలు, మెట్రో రీ అలైన్ మెంట్, ఫార్మాసిటీ రద్దు వంటి అనాలోచిత, అపరిపక్వ నిర్ణయాలే.
• 2024-25 కు గాను 14వేల కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో రాబడి మించే అవకాశం లేదు.
• అయినప్పటికీ 2025-26కు గాను మీరు పెట్టుకున్న అంచనా 19 వేల 103 కోట్లు
• మేము సాధించినట్లుగా మీరు కూడా 25శాతం గ్రోత్ రేటును సాధించినా 17 వేల 500 కోట్లు దాటే అవకాశం లేదు.
• ఇక్కడ 1500 నుంచి 2 వేల కోట్లు మళ్లీ ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారు.
• గ్రాంట్ ఇన్ ఎయిడ్ :
• 2023-24 లెక్కల ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ 9,933 కోట్లు వచ్చాయి.
• 2024-25కు గాను మీరు 21 వేల 636 కోట్లు అంచనాలు పెట్టుకున్నారు.
• గ్రాంట్ ఇన్ ఎయిడ్ 12 – 13 వేలకు మించి వచ్చే అవకాశమే లేదు.
• రివైజ్డ్ ఎస్టిమేట్ లో కూడా 19 వేల 836 కోట్లు పెట్టుకోవడం విడ్డూరం
• రివైజ్డ్ ఎస్టిమేట్స్ కంటే కనీసం 6 – 7 వేల కోట్ల రూపాయలు తక్కువగా వస్తాయి.
• ఇదిలా ఉంటే, 2025-26 బడ్జెట్ అంచనాలు 22 వేల కోట్లుగా చూపడం హాస్యాస్పదం
• ఇక్కడ కూడా కనీసం 7 – 8 వేల కోట్ల రూపాయలు తక్కువగా వచ్చే అవకాశముంది.
నాన్ టాక్స్ రెవెన్యూ : (పన్నేతర ఆదాయం) – భూముల అమ్మకం
• పన్నేతర ఆదాయం 2023-24లో 23 వేల 819 కోట్లు వచ్చింది
• 2024-25 బడ్జెట్ అంచనాలలో 35 వేల 208 కోట్లుగా అంచనాలు వేశారు.
• రివైజ్డ్ ఎస్టిమేట్స్ కింద 25 వేల 814 కోట్లకు అంచనాలు సవరించారు. ఇందులో సింహభాగం 10 వేల కోట్లు టీజీ ఐఐసీ భూముల తనఖా ద్వారా వచ్చి ఉండవచ్చు.
• అయినప్పటికీ 25 వేల 814 కోట్ల అంచనా అందుకోవడం అనుమానాస్పదమే.
• 2025-26లో బడ్జెట్ అంచనాలు 31 వేల 618 కోట్లుగా పెట్టుకున్నారు
• అంటే వేల కోట్ల రూపాయల భూములను అమ్మడంగానీ, తనఖా పెట్టడంగానీ జరుగుతుందని చెప్పకనే చెప్పారు.
• కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిన పరిస్థితుల్లో మీరు పెట్టుకున్న 31 వేల 618 కోట్ల అంచనాలు అందుకోవడం అసాధ్యం.
• అంటే 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్స్ తో పాటు, 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ కూడా ప్రభుత్వం అందుకోవడం కష్టసాధ్యం.
• మీ 3 లక్షల 4 వేల కోట్ల బడ్జెట్– It’s an Un Realistic Estimates
అడుగడుగునా అణచివేతలు..
రాహుల్ గాంధీ మొహబ్బత్ క దుకాన్ అని దేశం అంతా తిరుగుతున్నడు,
రేవంత్ గారి పాలన నఫ్రత్ కా మకాన్ గా మారింది.
• తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తదంటే జనం ఏమో అనుకున్నరు.
• ఎమర్జెన్సీ నాటి అణిచివేతలు, నిర్బంధాలు పునరావృతం అవుతాయని ఇప్పుడు స్పష్టమైంది.
• 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామని చెప్పారు.
• ఆరు గ్యారెంటీలకు ఏ గతి పట్టిందో, ఏడో గ్యారెంటీకి అంతకంటే అధ్వాన్నమైన గతి పట్టింది.
• ప్రశ్నిస్తే అరెస్టులా? నిరుద్యోగులు నిలదీస్తే లాఠీ చార్జీలా?
• మా భూముల్లో ఫార్మా చిచ్చు పెట్టవద్దన్నందుకు… లంబాడీ బిడ్డలపై లాకపు హింసలా?
• రైతు చేతులకు బేడీలు వేసి తీసుకు వస్తరా. ఇదేనా ప్రజా పాలన అంటే?
• ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నిరసనలు చేసే హక్కు తొలగిస్తారా?
• ఎన్నికలకు ముందేమో ప్రజలారా స్వేచ్చగా పోరాడండి అన్ని వర్గాలను రెచ్చగొట్టారు, ఎన్నికలయ్యాక పోరాడే ప్రతి వారినీ చావగొడుతున్నారు.
• ఫిరాయింపులను నిలదీస్తే ఇండ్లపై దాడులు చేస్తారు.
• పసిపిల్లలు తమ పుస్తకాలు తీసుకోనివ్వకుండా ఇండ్లు కూలగొడుతారు.
• లైబ్రరీలో చొరబడి విద్యార్థుల వీపులు వాయగొడుతారు.
• శాసనసభ బయట ప్రశ్నిస్తే జైళ్లకు పంపిస్తారు.
• శాసనసభ లోపల ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్లగొడుతుంది ఈ ప్రభుత్వం.
ఇవాళ రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న ఒకే ఒక ఎర్రర్ కారణంగా, టెర్రర్ ను చవిచూపిస్తున్నారు.
ఇక క్రైమ్ రేటు చూస్తే…
• ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలే కొలమానం.
• ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకీ దిగజారుతున్నాయి.
• ఈ ఏడాది క్రైం రేటు 24శాతం ఎక్కువగా నమోదైందని మీరు పెట్టుకున్న డీజీపీ గారే చెబుతున్నరు అధ్యక్షా..
ముగింపు
• రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు కలిసి నిర్మించిన గాలి మేడ ఈ బడ్జెట్
• ఎన్నికల ముందు పాతాళ భైరవి… నరుడా ఏమి నీ కోరిక ?
• ఎన్నికల తర్వాత… పాపాల భైరవి. నన్నేం అడుగకు, నాకేం తెల్వది.
• డిసెంబరు 9, 2023 వరకు అమలు చేస్తామన్న వాగ్దానాలు అమలుకావడానికి ప్రజలు ఇంకా ఎన్ని డిసెంబర్లు ఎదురు చూడాలో
• రావాల్సిన డిసెంబరు అసలు వస్తుందో రాదో అనే అనుమానాలు ముసురుకున్నాయి.
• ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమార ప్రగల్బాలు
• వ్యక్తిగత దూషణలతో మార్చురీ కంపు కొడుతున్న సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేక జనం ఛీ కొడుతున్నారు.
• చెవులకు చిల్లులు పడుతున్నాయి గానీ చేయూత పించన్లకు చిల్లి గవ్వ రాలడం లేదు.
• ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో ఏమన్నారు అధ్యక్షా.. ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెబుతున్నా… ఒక్కనొక్కని తోడ్కలు తీస్త, బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుత.’’ అన్నడు.
• నిండు సభలో చైర్ ను ఉద్దేశించి చెప్పగల ముఖ్యమంత్రి గారి సంస్కారం ఎంత గొప్పది అధ్యక్షా? ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.
• మీరు పెట్టగలిగే పూర్తి స్థాయి బడ్జెట్ లు నాలుగే
• అందులో రెండు బడ్జెట్ లు పూర్తయి పోయాయి.
• మిగిలినవి రెండే… అంటే పుణ్యకాలం కాస్తా కరిగిపోతున్నది కానీ మీరు చూపించిన కలలు మాత్రం నిజమయ్యే దాఖలా కనిపించటం లేదు.
• మీ ప్రతికూల పాలసీలు, ప్రతీకార రాజకీయాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి.
• రాష్ట్ర ఆదాయ వనరులు ఒకటొకటిగా తగ్గుతున్నాయి. మేము పెంచుతూ వచ్చిన ఆదాయాన్ని మీరు తగ్గిస్తూ పోతున్నారు.
• ఈ నేపథ్యంలో రాష్ట్రం ముందు ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నది.
• అరచేతిలో వైకుంఠం చూపించిన అభయహస్తం మ్యానిఫెస్టో ఇక శూన్య హస్తమేనని మీ రెండు వార్షిక బడ్జెట్ లు తేల్చేశాయి.
• పది సంవత్సరాలు పరుగులు తీసిన ప్రగతి రథానికి రేవంత్ మార్క్ ప్రజాపాలన స్పీడ్ బ్రేకర్ గా మారింది.
• టాప్ గేర్ లో పరుగులు పెడుతున్న రాష్ట్రం క్రమక్రమంగా రివర్స్ గేర్ లో పడే ప్రమాదం క్లియర్ గా కనిపిస్తున్నది.
• ఈసారి బడ్జెట్ లో ఆరు గ్యారంటీలలోని కీలక అంశాలపై మీరు ప్రతిపాదనలు కూడా పెట్టలేదంటేనే మీలో ఆత్మవిశ్వాసం లేకుండా పోయిందని చెప్పకనే చెప్పారు.
• రాజ్యం అసమర్థమైనదిగా మారినప్పుడు ప్రజలపై అణచివేత ప్రయోగిస్తుంది.
• కనుక రాబోయే రోజుల్లో ప్రజలకు లభించేవి ముఖ్యమంత్రి గారి తిట్లు, పోలీసుల నుండి కొట్లు
• కెసిఆర్ గారి పాలనలో ప్రజలు సంక్షేమాన్ని అభివృద్ధిని చవి చూస్తుంటే మీరు వచ్చి లేని ఆశలు రేపారు.
• మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాట గలిపారు.
• వైకుంఠపాళిలో పెద్ద పాము మింగినట్టు అయింది.
• మీ మార్పేమిటో జనానికి తెలిసిపోయింది.
• జనం తీర్పేమిటో ఓట్ల రూపంలో తెలియడానికి కొంత కాలం మిగిలి ఉంది.
చివరగా.. పంచతంత్రంలో చిన్నయసూరి చెప్పిన నీలిరంగు కథ నక్క కథ అధ్యక్షా…
ఒక నక్క ఆహారాన్ని వెతుక్కుంటూ ఊర్లోకి వచ్చిందట. అక్కడ రజకులు బట్టలకు వాడే నీలిరంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. దీంతో ఆ నక్క ఒంటి నిండా నీలిరంగు అంటుకున్నది. ఆ తర్వాత అది మళ్లీ అడవిలోకి పోయింది. నీలిరంగు నక్కను చూసి ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న మిగిలిన జంతువులన్నీ భయపడ్డయి. ఇదేదో బాగుంది అనుకున్న నక్క… నేను దేవుడు పంపిన దూతను, ఈరోజు నుంచీ నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క ఎన్ని కష్టాలు పెట్టినా భరించాయి. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది. కొత్త చట్టాల గురించి చెబుతున్నది. అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క ఒంటికి అంటిన నీలిరంగంతా కరిగిపోయింది. నక్క నిజ స్వరూపం బయటపడింది. మాయమాటలతో, మారు వేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలం నిలవవు అన్నది ఈ నీలిరంగు నక్క కథలో నీతి సూత్రం అధ్యక్షా.. ఈ కథలోలాగానే ఈ కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు ఎక్కువకాలం నిలవవు. వీళ్ల మాయమాటలు, కుటిల నీతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్ధమైపోయింది అన్నారు.