గజ్వేల్‌లో బతుకమ్మ చీరలు పంపిణీచేసిన హరీష్‌…

835
harishrao gajwel
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సోమవారం ఉదయం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞ గార్డెన్స్ వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని.. కొత్త దుస్తులు లేకుండా ఉండకూడదు. అంతా చిరునవ్వులతో ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవంతో బతకాలని, ప్రభుత్వం తరపున కుల, మతాలకు అతీతంగా ముస్లిం మైనారిటీ పండుగలు అధికారికంగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున క్రిస్టియన్స్ కొత్త బట్టలు పంపిణీ చేశామని, అలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టిందని పేర్కొన్నారు. ఇవాళ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిలో నమ్మకం, విశ్వాసాన్ని కల్పిస్తున్నదని వివరిస్తూ.. విద్య, వైద్యం, సంక్షేమ పథకాల కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా రాష్ట్ర ప్రజలంతా.. చిరునవ్వులతో ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా చేనేత కార్మికులు బతకాలి., తెలంగాణ రాష్ట్రం లోని అక్కా చెల్లెళ్ళకు చీరలు అందించాలనే సీఎం కేసీఆర్ సమాలోచన చేశారని చెప్పారు. చేనేత కార్మికులకు ఉపాధి ఇవ్వడంతో పాటు తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం తరపున చీరలు పంపిణీ చేయాలని ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
ఉపాధి లేక ఆకలితో సతమతం అవుతున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు., రాష్ట్రంలోని ప్రతి మహిళా పండుగకు కొత్త దుస్తులు కట్టుకోవాలని బతుకమ్మ చీరలు అందిస్తున్నామని తెలుపుతూ.. ప్రభుత్వం ఈ యేట 10 రకాల డిజైన్ల చీరలను 10 రకాల రంగులతో తయారు చేయించిందని హరీశ్ రావు చెప్పారు.

ఈ సారి 10 లక్షల చీరలు 9 మీటర్లు, మిగతా 90 లక్షలు చీరలు 6 మీటర్ల సైజులో తయారు చేయించినట్లు చెబుతూ.. ఈ చీరలను పూర్తిగా చేనేత కార్మికులతో వీటిని రూపొందించినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అవసరమైన కోటి చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, 18 ఏళ్లు పైబడి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 67 వేల 262 చీరలు పంపిణీ చేస్తున్నామని, గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 12వేల 515 మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొట్ట మొదట బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని గజ్వేల్ లో ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

మండలానికి 20 మంది, వార్డుకు 10 మంది చొప్పున్న అన్ని మండలాల్లో 3, 4 రోజుల్లో ఎంపీపీ, జెడ్పిటిసిలతో కలిసి పూర్తి చేయాలని, ఆలాగే మున్సిపల్ వార్డుల్లో రోజుకు 6 వార్డుల్లో ఆర్పీల ఆధ్వర్యంలో టౌన్ లో పంపిణీ చేయాలని, ముఖ్యంగా తహశీల్దార్లు, ఎంపీడీఓ, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ కు సూచించారు. అయితే పేద మహిళకు బట్టలు పెట్టిన ముఖ్యమంత్రి మన కేసీఆరేనని., గత ప్రభుత్వాల హయాంలో ఎవ్వరూ ఇలా చేయలేదని పేర్కొన్నారు.

కాలమైనా.. కాకపోయినా.. మళ్ళీ వచ్చే బతుకమ్మ పండుగ వరకు కాళేశ్వరం నీళ్లలో..గజ్వేల్ లోని పాండవుల చెరువు మత్తడి దూకుతుంటే.. మన బతుకమ్మలు వేసుకుంటామని ధీమాగా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా.. ఆర్థిక మాంద్యం వచ్చిందని., కేంద్రం మన రాష్ట్రం పై కోతలపై కోతలు విధిస్తున్నదని., ఆర్థిక మాంద్యం వచ్చినా.. కేంద్రం నుంచి రాష్టానికి రావాల్సిన నిధులు ఇస్తామని ఇవ్వకున్నా.. ప్రతి పేదింటి ఆడ పిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్., ప్రతి నెలా రూ.2016 ఆసరా పింఛన్లు, ప్రభుత్వ ఆసుపత్రిలోకి పోతే.. కేసీఆర్ కిట్, రూ.13 వేల రూపాయలు ఇవ్వడంతో పాటు తల్లిబిడ్డలను ఆసుపత్రి నుంచి ఇంటి వరకూ ప్రభుత్వ ఖర్చుతో.. ఇంటికి పంపుతున్నట్లు వివరించారు.

కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఏ ఒక్కరైనా.. ఒక్క పండుగకు అయినా బతుకమ్మ చీరలను ఇచ్చారా..అంటూ సూటిగా ప్రశ్నించారు. భారత దేశంలో 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వెల్లడించారు. ప్రతి పండుగకు ఎవ్వరూ ఇబ్బందులు పడొద్దని., అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక అంటూ.. మన రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రతి పేదవాడిని.. తన తోబుట్టువుల్లా.. భావించి.. పేద మహిళలకు ప్రతి పండుగకు బట్టలు పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే.. అది దేశంలోనే కేవలం ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.

చేనేత కార్మికులకు ఉపయోగకరంగా ఉండేలా.. అర్హులైన ప్రతి ఒక్క పేద వారికి చీరలను పంపిణీ చేస్తున్నాం. అంతకు ముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం తీసుకొనటువంటి గొప్ప నిర్ణయం బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారని పేర్కొన్నారు. అందరూ సంతోషంగా ఉండాలన్నదే.. సీఎం కోరిక అంటూ.. తొలి కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.

గజ్వేల్ నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని., ప్రజల దీవెనతోనే రెండోసారి కూడా ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. అంతకు ముందు జెడ్పి ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ..కొత్త బట్టలు ఇస్తే సంతోషంగా ఉంటారని., తెలంగాణ లోని ఆడపడుచులకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరేలా.. సీఎం కేసీఆర్ సంకల్పించారని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా అన్ని రకాల ప్రజలకు క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు ప్రభుత్వం తరపున ఇతోధికంగా చేయూతగా ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులు అందరికీ చీరలు పంపిణీ కార్యక్రమాన్నీ చేపట్టిందని తెలిపారు. చీరల పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ మండలాలకు చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -