విదేశీ విద్యా పథకం నిధులేవి: హరీష్ రావు

20
- Advertisement -

విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్ షిప్ డబ్బులు రాక ఆవేదన చేందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండడం.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారుతుందన్నారు.

ఇదే విషయమై డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని, స్కాలర్ షిప్స్ బకాయిల విడుదలకు మార్చి వరకు సమయం ఉందని మంత్రి సీతక్క సమాధానం చెప్పారు. ఈ మాట చెప్పి మూడు నెలలు పూర్తి కావస్తుంది, ఇప్పటివరకు మూడు రూపాయల బకాయిలు కూడా చెల్లించిన దాఖలు లేవు అన్నారు.

రేవంత్ సర్కారుకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడం పై ఉన్న ధ్యాస, పేద విద్యార్థుల చదువులకు బకాయిలు చెల్లించడం పై లేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి, ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు ప్రారంభించిన విదేశీ విద్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఈ పథకం కింద ఎంపిక చేయలేదు. ఏడాదిన్నరగా ప్రక్రియ దరఖాస్తుల దశలోనే నిలిచిపోయింది. కొందరు దరఖాస్తుదారులు ఇప్పటికే అప్పులు చేసి విదేశీ విద్యకు వెళ్లగా, మరికొందరు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పథకంలో ఎంపిక అవుతామేమో అనే ఆశతో ఇక్కడే ఉండి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మొద్దునిద్రను వీడి తక్షణమే స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, విదేశీ విద్య పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి పేదలకు విదేశాల్లో చదివే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:మల్లన్న కామెంట్స్‌పై రేవంత్ వివరణ ఇవ్వాలి

- Advertisement -