చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు..సీఎంకు హరీశ్‌ సవాల్

14
- Advertisement -

రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు అని సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు… కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు అన్నారు.

కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట… వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ మూసీ ప్రక్షాళన లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు… పదేపదే పాలమూరు బిడ్డను అంటూ, శుష్కమైన సెంటిమెంట్ ను వల్లించడమే తప్ప పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదు అన్నారు.

నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులు, రేవంత్ కు మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు, ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు… 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపం?, బంగారం పండే నల్లరేగడి భూములుండిన పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులేనన్నారు.

తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్ ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణాజిల్లాల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు.. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బిఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం అన్నారు.

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ఏది పడితే అది అనగల సమర్థులు మీరు. జలయజ్ఞం ధనయజ్ఞమని మాట్లాడింది మీ నోరే కదా. శిలాఫలకాలు వేసి, కొబ్బరి కాయలు కొట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు దండుకొని, కనీసం భూసేకరణ కూడా పూర్తి దగాకోరు చరిత్ర కాంగ్రెస్ ది. . కాంగ్రెస్ హయాంలో నత్త నడక నడిచిన పనులను పరిగెత్తించి పూర్తి చేసింది బిఆర్ఎస్. ఇది పాలమూరులో ఏ రైతును అడిగినా చెప్పే సత్యం. రివర్ వాటర్ పొలాలకు ఇచ్చింది రివర్స్ మైగ్రేషన్ పాలమూరులో జరిగేలా చేసింది బిఆర్ఎస్ అన్నారు.

ప్రాజెక్టుల పేరిట డబ్బులు దండుకోవడానికి ఈపీసీ విధానం తెచ్చి ఇష్టమున్నట్టు దోచుకుంది కాంగ్రెస్ నాయకులు. ఆనాడు తెలుగుదేశం నాయకుడిగా జలయజ్ఞం అవినీతి భాగోతాల గురించి నువ్వే మాట్లాడిన మాటలు మర్చిపోయావా?, కల్వకుర్తి ప్రాజెక్ట్ కింద 3.07లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.42లక్షల ఎకరాలు, బీమా కింద 1.58లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 38వేల ఎకరాలు, తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్ కాల్వ కింద ఉన్న 55వేల ఎకరాలను స్థిరీకరించి, ఆర్డీఎస్ లో మొత్తం 87,500 ఎకరాలకు సాగు నీరు అందించింది బీఆర్ఎస్ కాదా అన్నారు.

జూరాల జలాశయంలో కర్ణాటక ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లించి, మొదటిసారిగా జలాశయంలో 9 టీఎంసీల నీటిని నింపి, లక్ష ఎకరాలకు సాగు నీరు అందించినం. అది మీ కండ్లకు కనబడదు.. మిషన్ కాకతీయతో భాగంగా మహబూబ్ నగర్ లో 1544 చెరువులు, నాగర్ కర్నూల్ లో 2024, నారాయణ్ పేటలో 950, గద్వాల్ లో 563, వనపర్తిలో 1329 మొత్తం 6410 చెరువుల కింద 3లక్షల 22వేలు 579 ఎకరాలు స్థిరీకరించాం. 66 చెక్ డ్యాంలు, ఐడీసీ లిఫ్ట్ ల కింద మరో 24వేల ఎకరాలు స్థిరీకరించాం అన్నారు.

Also Read:కేసీఆర్‌తోనే తెలంగాణ నిలుస్తుంది.. గెలుస్తుంది

- Advertisement -