కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మార్పు ఎన్నికల వాగ్దానాలను మార్చడమేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికలయ్యాక హామీల పాతర అని మండిపడ్డారు.అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీష్.. కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.రైతుబంధు కింద ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తామన్న సంకల్పం ఏమైంది. రైతులు, కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కౌలు రైతులను రైతులే చూసుకోవాలంటున్నారు అని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసింది లేదు… వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేం ఇచ్చిన 5లక్షలకు మించి పెంచింది లేదు అన్నారు.
మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వీఎల్‌ఆర్ వర్తిస్తుంది అనే ఉత్తర్వులు ఉంటే చూపండి లేదా ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసిందనందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఫసల్ బీమాకు రూపాయి ఇవ్వలేదని, ఫసల్ బీమా చేయట్లేదు. జాబ్ క్యాలెండర్.. జాబ్‌లెస్ క్యాలండర్ అయింది అని ఎద్దేవా చేశారు.
ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగానికి మా ప్రభుత్వ హయాంలో అనుమతులు తెచ్చామన్నారు. భూసేకరణకు రూ.1,525 కోట్లు పెట్టామని గత బడ్జెట్‌లో చెప్పారు. ఏడాదైనా ఒక్క ఎకరా సేకరింలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని ఎకరాలను సాగునీరు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.