ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫిబ్రవరి నెలలోనే చెల్లించాల్సిన రూ. 775 కోట్ల ప్రీమియం మూడు నెలలుగా ప్రభుత్వం చెల్లించకపోవడం శోచనీయం అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతు కుటుంబాలకు శాపంగా మారుతుందన్నారు. అసలు రాష్ట్రంలో రైతు బీమా పథకం కొనసాగుతున్నదా?,లేదా అటకెక్కించారా అనే అనుమానం కలుగుతుంది…వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు, యాసంగి పైసలు ఎప్పుడు ఇస్తారు..అని మేము అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు..మార్చి 31 లోగా మొత్తం చెల్లిస్తామని చెప్పి మాట తప్పారు. మొత్తంగా రైతు బంధు పథకాన్ని ప్రశ్నార్థకం చేశారు అన్నారు.
రుణమాఫీ హామీ విషయంలో మేము వెంటబడితే దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారు. సగం మందికి కూడా రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురుపోసుకున్నారు…
ఇప్పుడు రైతు కుటుంబాలకు ధీమా ఇచ్చే రైతు బీమా పథకాన్ని లేకుండా చేస్తున్నారు అన్నారు.ఇంతకంటే అమానుషం ఏమైనా ఉంటదా? ఇది కచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమే…పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి, మంత్రులకు రైతు కుటుంబాల కన్నీళ్లు కనిపించడం లేదా? చెప్పాలన్నారు.
వివిధ కారణాలతో గడిచిన మూడు నెలల్లో సుమారు వందకు పైగా రైతులు చనిపోయినట్లు తెలుస్తోంది..ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఆయా కుటుంబాలకు రైతు బీమా సాయం అందకుండా పోయింది అన్నారు. ఒకవైపు కుటుంబ పెద్దను కోల్పోయి, మరోవైపు రైతు బీమా అందక ఆ కుటుంబాలు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నాయి…రైతు కుటుంబాలకు ప్రభుత్వమే రూ. 5లక్షలు చెల్లించి, LIC కి పెండింగ్ లో ఉన్న ప్రీమియం తక్షణం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
Also Read:విజయ్..హిట్ కొట్టేనా?

