హైదరాబాద్‌లోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఆయన ఆసుపత్రికి వెళ్లి..అక్కడ రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ క్రమంలో గైనకాలజీ వార్డును మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. గైనకాలజీ వార్డుల్లో నిత్యం స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకు అదనంగా మరో రెండు అల్ట్రా సౌండ్ యంత్రాలు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. 60 శాతానికి పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని హరీశ్‌రావు సూచించారు.
అంతేకాదు ఈ తనిఖీలో ఓ డాక్టర్‌పై మంత్రి హరీశ్ వేటు వేశారు. కొంత మంది వ్యక్తులు మంత్రిని కలిసి.. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ మూర్తి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై హరీశ్‌రావు అక్కడికక్కడే విచారణ చేపట్టి.. డాక్టర్ మూర్తిని సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.