అందరూ అవయవ దానానికి ముందుకు రావాలి- మంత్రి హరీష్‌

62
- Advertisement -

జీవన్ దాన్ ఆధ్వర్యంలో అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యులకు రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ముఖ్య అథితిగా హజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిఎంఇ రమేష్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, స్థానిక కార్పోరేటర్ విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2020లో 88 కుటుంబాలు అవయవ దానం చేశాయి. తద్వారా వందల మందికి ప్రాణదానం చేశారు. కరోనా వల్ల గత ఏడాది వారిని సన్మానించలేకపోయామన్నారు. ఈ కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ వాళ్ళను కోల్పోయినా నలుగురికి ప్రాణదానం చేయడం గొప్ప విషయం. మీ నిర్ణయం ఎంతో స్ఫూర్తిదాయకం అని మంత్రి కొనియాడారు.

మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వీళ్ళను చూసి ఇతరులు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మనం చనిపోయినా ఇతరుల రూపంలో జీవించడమే.. అవయవ దానం. వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందినా కిడ్నీ, లివర్, హార్ట్ వంటివి ఇంకా కృత్రిమంగా తయారు చేయలేదు. కాబట్టి మన అవయవాలు మట్టిలో కలిపే కంటే దానం చేయడం ఎంతో మిన్న అన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు త్వరగా నిర్ణయం తీసుకోవాలి. నలుగురికి ప్రాణం పోయాలి అని మంత్రి కోరారు.

దేశంలో అవయవ దానాన్ని పారదర్శకంగా ఆన్లైన్ లో ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం, ఇతర అనేక రాష్ట్రలు మనల్ని అనుసరిస్తున్నాయి. ఇప్పటివరకు 1000 మంది అవయవ దానం చేశారు. వారి ద్వారా సుమారు 4 వేల మంది ప్రయోజనం పొందారు. ప్రస్తుతం జీవన్ దాన్ లో 8 వేల మంది రిజిస్టర్ అయ్యారు. వారు నాలుగైదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. మూఢనమ్మకాలు వదిలి మరింత మంది అవయవ దానానికి ముందుకు రావాలి అని మంత్రి హరీష్‌ సూచించారు.

ఇటీవల CPI నారాయణ సతీమణి వసుమతి, స్వతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివ దేహాలను మెడికల్ కాలేజీలకు ఇచ్చారు. వీరి నిర్ణయం స్ఫూర్తి దాయకం. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సను ప్రభుత్వ దవాఖానలో చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లో 400 ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్స్ అయ్యాయి. ఇందుకు ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షలు అందజేస్తున్నారు. అంతే కాకుండా వారికి ప్రతి నెల ఉచితంగా రూ. 20 వేల మందులు అందిస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -