నేటి ఫోటో రేపటి చరిత్రకు సాక్ష్యం..

293
Minister Harish Rao
- Advertisement -

నేటి ఫోటోలే రేపటి చరిత్రకు సజీవ సాక్ష్యాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. పత్రికల్లో వార్తలను చదివించే శక్తి ఫోటోకు మాత్రమే ఉంటుందన్నారు. వేయి మాటలతో, వందలాది పదాలతో చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో వ్యక్తీకరిస్తుందని మంత్రి అన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆయా సంఘటనలను కవర్ చేసే ఫోటోగ్రాఫర్లను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారిని ఇక నుంచి ఫోటోగ్రాఫర్లుగా పిలవకుండా….ఫోటో జర్నలిస్టులుగా పిలవాలని మంత్రి సూచించారు. ఇవాళ ఆయన రవీంధ్రభారతిలో తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోషియేషన్, తెలుగు పర్యాటక, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఫోటోలు తీయడం ఆషామాషీ వ్యవహారం కాదని, అది ఓ కళని మంత్రి చెప్పారు. ఇందుకు ఎంతో కష్టం, శ్రమ, ప్రతిభ, ముందు చూపు అవసరమన్నారు.

Minister Harish Rao

ఫోటోకు భాష అవసరం లేదని… నిరక్ష్యరాస్యులు సైతం ఫోటోను అర్థం చేసుకోగలరన్నారు. ధర్నాలు, ఉద్యమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, ఉగ్రవాద దాడులు, ప్రకృతి బీభత్సాలు ఇలా ఏది జరిగినా.. అక్కడ ముందుండేది ఫోటో జర్నలిస్టులేనని మంత్రి హరీష్ రావు కొనియాడారు. మెరుపుతో కూడా పోటీపడి ఫోటో జర్నలిస్టులు ఛాయాచిత్రాలు తీయడం గొప్ప విషయమన్నారు. ఫోటోగ్రఫీ వృత్తి సవాల్‌తో కూడిన పని అన్నారు. కేవలం ఫోటోలు తీయడమే కాకుండా పాత్రికేయ నైపుణ్యం ఉంటేనే ఆ ఫోటోకు అర్థం ఉటుందన్నారు. ఫోటో జర్నలిస్టుల శ్రమ, వారి కష్టం తాను స్వయంగా చూస్తూ ఉంటానన్నారు. చక్కని ఫోటోలు తీసేందుకు వారు పడిన పాట్లు లేవని, ఎంతో సాహాసంతో ప్రాణాలు లెక్కచేయకుండా ఫోటోలు తీసి ప్రపంచానికి అందించిన సంఘనటలు ఎన్నో ఉన్నాయన్నారు.

Minister Harish Rao

దేశంలో జర్నలిస్టులతో పాటు, ఫోటో జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తోన్న ఎకైక రాష్ట్రం తెలంగాణయేనని మంత్రి హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన ఫోటోలు తీయడమే కాకుండా, ఉద్యమ కార్యక్రమాల్లో పోలీసులకు తమకు మధ్య రక్షణ కవచంగా పని చేశారని ఫోటో జర్నలిస్టులను మంత్రి కొనియాడారు. జర్నలిస్టులకు సమానంగా ఫోటో జర్నలిస్టులకు సైతం అకిడేషన్, బీమా, వైద్య సదుపాయాలు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటితో పాటు ఇళ్ల స్థలాలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. సుప్రింకోర్టుల కేసు ఉన్నందున ఇబ్బంది లేకుండా ఎలా న్యాయం చేయాలన్నదానిపై ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రజా జీవితంలో ఉండే జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే చక్కగా పని చేస్తారని సీఎం భావిస్తున్నారన్నారు.

Minister Harish Rao

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఫోట జర్నలిస్టులు తీసిన ఛాయాచిత్రాలను డిజిటల్ లైబ్రరీ రూపంలో భద్రపరిచే బాధ్యతను ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తీసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఉద్యమం నాటి పరిస్థితులను కళ్లకు కట్టే ఫోటోలు రేపటి తరానికి ఆస్థిలాంటివన్నారు. ఉస్మానియాలో విద్యార్థుల పోరాట పటిమ, మిలియన్ మార్చ్, సాగర హారం, కేసీఆర్ ఆమరణ దీక్ష, ఖమ్మం, నిమ్స్ ఆసుపత్రుల వద్ద ఉద్యమ కార్యక్రమాలు, అమరుడయిన శ్రీకాంతా చారి సన్నివేశాలు…తెలంగాణ చరిత్రకు ప్రతిరూపాలన్నారు. ఇలాంటి ఫోటోలను భద్రపరిచే విషయంలో ప్రభుత్వ పరంగాను, వ్యక్తిగతంగాను ఎలాంటి సాయం అవసరం ఉన్నా తాను చేస్తానని మంత్రి హరీష్ రావు హమీ ఇచ్చారు.

Minister Harish Rao

మంత్రి సూచనల మేరకు తెలంగాణ ఉద్యమ సందర్భంగా తీసిన ఛాయాచిత్రాలను డిజిటల్ లైబ్రరీ రూపంలో భద్ర పరుస్తామని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. ముందుగా వంద చిత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తామన్న ఆయన అన్ని జిల్లాల ఫోటో జర్నలిస్టులు ఇందుకు సహకరించాలని కోరారు. ప్రభుత్వం జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని కొనియాడారు. వంద కోట్ల సంక్షేమ నిధి ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. ఫోట జర్నలిస్టులు మంచి ప్రమాణాలతో కూడిన ఫోటోలు తీయాలని సూచించారు. భీభత్సంతో కూడిన ఫోటోలు పత్రికల్లో ముద్రించడం తగదన్న ఆయన ఫోటో జర్నలిస్టులు తమ ప్రమాణాలు పెంచుకోవాలని సూచించారు.

రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో విజేతలకు బహుమానాలను మంత్రి హరీష్ రావు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అందజేశారు. విభాగాల వారిగా ఫ్రథమ, ద్వితీయ, తృతీయ బహమానాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాఠిల్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్. తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు.

- Advertisement -