నిత్యం కార్మికుల మధ్య ఉంటూ శ్రమజీవిలా కష్టపడే నాయకుడు వినయ్ భాస్కర్ అని, హరీశ్‌రావు కొనియాడారు. కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా హనుమకొండ టీటీడీ కల్యాణ మండపం ప్రాంగణంలో వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేసారు. ఈ క్యాంప్‌ను మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందనీయమని, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కనీసం కార్మికులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆటోలకు లైఫ్ టాక్స్ మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్మికులకు ఉచిత బీమా చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిల్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.
బీజేపీ ఉజ్వల్ పథకం కింద సిలిండర్లు ఇచ్చామని ప్రచారమే తప్ప ఇచ్చింది లేదన్నారు. గ్యాస్ ధరలు పెంచిన కారణంగా పేదలు తిరిగి పోయ్యిల కట్టెలను కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదన్నారు. వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏడాదిలోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.