నందమూరి హరికృష్ణ కుమారై నందమూరి సుహాసినికి టీడీపీ ప్రతినిధులు నామినేషన్ పత్రాలు అందజేశారు. శనివారం కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని నామినేషన్ వేయనున్నారు. రేపు ఎన్టీఆర్, హరికృష్ణ ఘాట్‌లో నందమూరి సుహాసిని తాతకు, తండ్రికి నివాళులర్పించబోతున్నారు. అనంతరం ఆమె సుహాసిని నామినేషన్ వేస్తారు. సుహాసినిని కూకట్పల్లి అసెంబ్లీ సీటుకు పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కూకట్పల్లి నుంచి ఆమె పోటీ అంశంపై రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మిత్రపక్షాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తొలుత ఈ స్థానాన్ని టీడీపీ నేత పెద్దిరెడ్డికి కేటాయిస్తారని భావించినప్పటికీ చివరి నిమిషంలో నందమూరి సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూకట్ పల్లి టికెట్‌ను స్థానికులకు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఆందోళనకు దిగారు.
కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రెబెల్ అభ్యర్థిని నిలబెడతామనీ, సుహాసినిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు తెలంగాణలో కుట్ర రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. కుల రాజకీయాలను చంద్రబాబు ఆంధ్రాలో చేసుకుంటే మంచిదనీ, తెలంగాణలో మానుకోవాలని హితవు పలికారు.