Pawan: కత్తి పట్టిన పవన్

4
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా పవన్.. ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్‌కి తిరిగి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈరోజు ఉదయం 7 గంటలకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను పవన్ ప్రారంభించినట్లు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ‘పవన్ కళ్యాణ్’ కత్తి పట్టుకుని ఉన్న లుక్ అభిమానులను థ్రిల్ చేస్తుంది. మార్చి 28, 2025న పాన్ ఇండియా సినిమాగా ‘హరిహర వీరమల్లు’ ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదల కానుంది.

ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, యువ దర్శకుడు జ్యోతికృష్ణ.. చిత్రీకరణ, నూతన తారాగణం, సాంకేతిక సిబ్బంది చేరిక వంటి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అలాగే ఆయన విడుదల చేసిన టీజర్, ఈ చిత్రంపై అంచనాలను మరింత పెరిగేలా చేసింది.

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ను రంగంలోకి దింపారు. అందాల నటి నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, దిగ్గజ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న ఈ కీలకమైన విజయవాడ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది. ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ను త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

దిగ్గజ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడుగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Also Read:శ్రీవిష్ణు.. ‘శ్వాగ్’

- Advertisement -