భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ ది ప్రత్యేక ప్రస్థానం. భారత క్రికెట్ జట్టును కెప్టెన్ గా నడపడం, తిరుగులేని పేసర్ గా, అద్భుతమైన ఆల్ రౌండర్ గా పేరు సంపాదించడం కపిల్ దేవ్ కు మాత్రమే సాధ్యమైంది. కపిల్ దేవ్ తరువాత ఎంతో మంది ఆల్ రౌండర్లు జట్టులోకి వచ్చినా కపిల్ దేవ్ లాంటి ఆల్ రౌండర్ లేని కొరత అలాగే ఉండిపోయింది. కపిల్ దేవ్ తర్వాత టీమ్ ఇండియాకు మరో ఆణిముత్యం దొరికాడని పలువురు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఆ యువ క్రికటర్ హార్దిక్ పాండ్య. అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాట్‌తో రాణిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తిస్తున్న పాండ్యకు కపిల్ దేవ్ నుంచి ఊహించని కితాబు లభించింది..
హార్డిక్ పాండ్య తనకంటే ప్రతిభావంతుడైన క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. పాండ్యాకు ఉన్న ప్రతిభ, సామర్థ్యంతో టీమిండియాకు మరింత కీలకంగా మారే అవకాశం ఉందని అన్నారు. అయితే అందుకు పాండ్య చేయాల్సిందల్లా కష్టపడడమేనని కపిల్ సూచించారు. అలా చేస్తే అతను జట్టులో కీలకమవుతాడని, ఎన్నో ఘనతలు అందుకుంటాడని కపిల్ ఆశీర్వదించారు. ఈ ప్రశంసలు పాండ్యలో మరింత స్పూర్తిని పెంచేలా ఉండడం విశేషం. ప్రస్తుతం భారత్-ఆసీస్ మధ్య జరుగుతోన్న వన్డే సిరీస్‌లో ఏడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు రాబడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో మూడు వన్డేలు ముగిసేసరికి పాండ్యనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.