భారత్–దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బంతితో అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ రెండు కీలక మైలురాళ్లు సాధించాడు. టీ20 అంతర్జాతీయాల్లో 1000 పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లు పడగొట్టిన తొలి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఈ అరుదైన డబుల్‌ను సాధించిన నాలుగో ఆల్‌రౌండర్ హార్దిక్ కాగా, అతనికి ముందు ఈ ఘనత సాధించిన ముగ్గురు (షకీబ్ అల్ హసన్, మహ్మద్ నబీ, సికందర్ రజా) అందరూ స్పిన్నర్లు కావడం విశేషం.
ఇదే మ్యాచ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌ను ఔట్ చేయడం ద్వారా హార్దిక్ తన 100వ వికెట్‌ను పూర్తి చేశాడు. ఇప్పటికే టీ20ల్లో 1000కిపైగా పరుగులు చేసిన హార్దిక్, మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. టీ20 అంతర్జాతీయాల్లో 100కిపైగా సిక్సులు, 1000కిపైగా పరుగులు, 100కిపైగా వికెట్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా, మొత్తం నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో సికందర్ రజా, మహ్మద్ నబీ, విరందీప్ సింగ్ సరసన హార్దిక్ చేరాడు.
మ్యాచ్ విషయానికి వస్తే, మూడో టీ20లో భారత్ దక్షిణాఫ్రికాపై సులభంగా విజయం సాధించింది. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులతో ఛేదనకు గట్టి పునాది వేశాడు. శుభ్‌మన్ గిల్ 28 పరుగులు చేయగా, నంబర్ 3లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ 34 బంతుల్లో 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చివర్లో శివమ్ దూబే నాలుగు బంతుల్లో 10 పరుగులు చేసి, సిక్స్, ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
Also Read:ఆంధ్ర జలదోపిడిపై బీఆర్ఎస్ పోరుబాట

