క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భజ్జీ..

59
Amritsar: Indian cricketer Harbhajan Singh interacts with press during a programme in Amritsar on Aug 21, 2019. (Photo: IANS)

టీమిండియా సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మధురమైన అన్ని అంశాలకు ఇది ముగింపు… జీవితంలో అన్నీ ఇచ్చిన ఆటకు నేటితో వీడ్కోలు పలుకుతున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ 23 ఏళ్ల ప్రస్థానాన్ని ఆనందమయం, చిరస్మరణీయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.

టీమిండియా సాధించిన ఎన్నో అద్భుతమైన విజయాల్లో హర్భజన్ కీలక పాత్ర పోషించాడు. 1998లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన హర్భజన్ సింగ్ ఆఫ్ స్పిన్నర్‌గా భారత జట్టుకు విశేష సేవలు అందించాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. ఈ పంజాబీ వీరుడు బౌలింగ్ లోనే కాకుండా, బ్యాటింగ్ లోనూ ధాటిగా ఆడుతూ అభిమానులను అలరించాడు.

కెరీర్ లో 103 టెస్టులు ఆడిన హర్భజన్ 417 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్ లో 2,224 పరుగులు చేశాడు. వాటిలో 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. 236 వన్డేల్లో 269 వికెట్లు తీసి, 1,237 పరుగులు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 పోటీల్లో 28 మ్యాచ్ లలో 25 వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియాలో హర్భజన్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

లోయర్ డౌన్‌‌లో బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచే ఈ పంజాబ్ స్పిన్నర్ ఇండియాలో అత్యంత విజయవంతమైన బౌలర్ల జాబితాలో రెండో వాడిగా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు, న్యూజిలాండ్‌పై వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు (711) తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాదు, భజ్జీ తన కెరియర్ చివరి రోజుల్లోనే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం గమనార్హం.