భోగ భాగ్యాలనిచ్చే ‘భోగి’

798
bhogi
- Advertisement -

భోగి అంటే భోజనం..భోగి అంటే దేవునికి భోగం…భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం..భోగి అంటే పాతకు శలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించడం..భోగి అంటే సూర్యుణ్ని ఆరాధించే అతి పెద్ద ఉత్సవం. సంక్రాంతి ముందు రోజు వచ్చేదే భోగి పండుగ.అసలు సిసలైన సంక్రాంతి పండుగ సంబరానికి.. భోగిపండుగ ఓ పవర్‌ఫుల్‌ టీజర్‌. ఆ టీజర్లో ఆకాశమంత ఎత్తులో ఊరందరికీ వెచ్చదనాన్ని పంచేవి భోగి మంటలు.

హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో “సంక్రాంతి” ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు “మకరరాశిలో” ప్రవేశించిన పుణ్యదినం. వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు భోగి,సంక్రాంతి,కనుమ.

‘భోగి’. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, భోగి మంటలు వీసి , కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.

సాయంత్రం పూట చాలా ఇళ్ళలో చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు. ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే “సంక్రాంతి” పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుతూ అందరికీ భోగి శుభాకాంక్షలు.

Also Read:డెవిల్ ఓటీటీ డేట్ ఫిక్స్!

- Advertisement -