KTR:హ్యాపీ బర్త్ డే..రామన్న

25
- Advertisement -

మాజీ సీఎం కేసీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి వారసత్వం పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఉపయోగపడింది కానీ తనను తాను నిరూపించుకుంటేనే ప్రజల్లో చిరస్ధాయిగా నిలిచిపోతారని భావించారు. అందుకే అనునిత్యం ప్రజలతోనే,ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయనే కేటీఆర్..కల్వకుంట్ల తారక రామారావు. ఇవాళ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ స్పెషల్ విషెస్ తెలియజేస్తోంది.

1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు సిద్ధిపేటలో జన్మించారు కేటీఆర్. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌లో ఎంబీఏ చేసిన రామ్…అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్‌ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2006లో కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.

2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు కేటీఆర్. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందారు..

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగురవేసిన కేటీఆర్ …తొలిసారి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2018 డిసెంబరు 17న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తూ, క్యాడర్‌కు దగ్గరై నాయకత్వంతో సమన్వయం చేస్తూ పార్టీ విజయవంతంగా ముందుండి నడిపించారు. పార్లమెంట్, పంచాయతీ, పరిషత్ ఎన్నికలతోపాటు హుజుర్‌నగర్ ఉపఎన్నికలో పార్టీ విజయబావుటా ఎగుర‌వేయ‌డం కేటీఆర్‌ది కీ రోల్. 60 లక్షలకు పైగా సభ్యత్వాలతో బీఆర్ఎస్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టడంలో రామన్నది కీలకపాత్ర. పార్టీపై కార్యకర్తల్లో భరోసా కల్పించడంతో పాటు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకుసాగుతున్నారు కేటీఆర్‌. ఫలితంగా 32 జిల్లాల జడ్పీలపై బీఆర్ఎస్ జెండా ఎగిరింది.

ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు వివిధ బిల్లులు, రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూ కేటీఆర్ ముందుకుసాగారు. దీంతో పాటు 32 జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణాలు చేయడంతో పాటు బూతు కమిటీల ఎంపికతో బీఆర్ఎస్‌ నిర్మాణంలో కీ రోల్ పోషించారు. ఫలితంగా 2019 సెప్టెంబరు 8న  కేసీఆర్ మంత్రివర్గంలో రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలుకాగా ప్రతిపక్షంలో సైతం ప్రజా సమస్యల కోసం గళమెత్తుతున్నారు కేటీఆర్. ఓ వైపు సోషల్ మీడియా మరోవైపు ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రజానాయకుడిగా,సేవకుడిగా పనిచేస్తున్న రామన్న ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

Also Read:దేశానికి పెద్దన్న కానీ తెలంగాణపై నిషేధం:మోడీపై సీఎం ఫైర్

- Advertisement -