హ్యాపీ బర్త్ డే….డార్లింగ్

216
prabhas birthday

ఆరడుగుల హైట్‌, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్‌….ఇవన్నీ కలిసి ఉన్న అసలు సిసలైన టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. హీరోగా వెండితెరపై బాహుబలిగా పాన్ ఇండియా మూవీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రభాస్ బర్త్ డే నేడు.

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నటవారసుడుగా ‘ఈశ్వర్‌’ చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్‌’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘రెబల్‌’, ‘మిర్చి’ వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌.

అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్‌ నటనకు తెలుగు సినిమానే కాదు.. బాలీవుడ్‌ ప్రేక్షకులు, విమర్శకులు శభాష్‌ అన్నారు. ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ సినిమానే కాదు.. దాన్ని మించేలా సినిమాలు చేయగల టాలీవుడ్‌ ఉందని తెలిసింది.రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేయ డమే కాదు, ఏకంగా తెలుగు సినిమా మార్కెట్‌ను ఆకాశమే హద్దు అనేలా చేసింది. బాహుబలి రెండు భాగాలు కలిపి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందంటే ఆ సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. బాహుబలి రిలీజ్‌ ముందు వరకు తెలుగు సినిమా మార్కెట్‌ ఓ వందకోట్లు ఉంటే.. రిలీజ్‌ తర్వాత ఆ రేంజ్‌ పాతిక రేట్లు పెరిగింది. దక్షిణాది సినిమా అంటే చిన్నచూపు చూసే ఉత్తరాది పరిశ్రమ ఆశ్చర్యపోయేలా కలెక్షన్స్‌ కుంభవృష్టిని కురిపించింది. పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్‌ హీరో అయ్యారు ప్రభాస్‌.

బాహుబలితో నేషనల్‌ హీరోగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ప్రభాస్‌ గురించి అంతర్జాతీయ మీడియాలో కూడా పలు వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్‌ మైనపు ప్రతి మను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజి యంలో ప్రతిష్టించారు. అందుకోసం 350 ఛాయా చిత్రాలను, ఆయన శారీరక కొలతలను తీసుకున్నారు. ఆయన బాహుబలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించడం విశేషం. బాహుబలి తర్వాత సాహో చేసిన ప్రభాస్‌ మరోసారి తన సత్తాచాటాడు.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ తర్వాత ఆదిపురుష్‌ చేస్తున్న ప్రభాస్ సినిమా సినిమాకు హీరోగా తన రేంజ్‌ను పెంచుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నాడు. అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా ‘డార్లింగ్‌’ అని పలకరించే ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియచేస్తోంది.