మన భారతీయ సంప్రదాయాల్లో ప్రధానమైనది, ప్రత్యేకమైనది గురుశిష్య పరంపర. గురుకులాలు కనుమరుగైనా ఇప్పటికీ అన్ని రంగాల్లో మనకు ఆ సంప్రదాయం కనిపిస్తూనే ఉంటుంది, ముఖ్యంగా క్రీడారంగంలో. కేంద్ర ప్రభుత్వం కూడా ఆటగాళ్ళకు ఇచ్చే అత్యున్నత అవార్డుకు ‘ అర్జున ‘ అని, కోచ్ కిచ్చే అవార్డుకు ‘ద్రోణాచార్య ‘ అని సరైన నామకరణం చేసింది.
ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన దేశ ప్రతిష్టను ప్రపంచపటంలో నిలబెట్టారు. ఒక విజనరీగా అకడామిని స్థాపించి ఎంతో మందికి స్పూర్తిని పంచుతున్నారు.తాను ఒక్కడే క్రీడారంగంలో ఉన్నత శిఖరాలకు ఎక్కితే చాలదు…తన శిష్యులను కూడా అదే దారిలో పయనింపజేసేలా పట్టుదలతో కృషిచేసి..రియో వరస వైఫల్యాల వల్ల వాడిపోయి ఉన్న మన ముఖాల్లో వెన్నెల వెల్లవిరిసించేలా చేసిన ద్రోణుడు గోపిచంద్. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.
1973నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించిన పుల్లెల గోపిచంద్ అనతి కాలంలో భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడుగా గుర్తింపు పొందారు. 2002లో తోటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీవీ లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు విష్ణు ప్రస్తుతం గోపీ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు.2001లో చైనా క్రీడాకారుడు చెన్‌హాంగ్‌ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నెగ్గాడు. ప్రకాష్ పదుకోనే తరువాత ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడిగా చరిత్రలో నిలిచారు.
ఒక పరాజయం చాలామందిని బాధిస్తుంది. నిస్సహాయుల్ని చేస్తుంది. ఒలింపిక్స్ లాంటి అత్యున్నత వేదికలపై ఆడి ఓడినప్పుడు కుంగుబాటుకీ గురవుతారు. కానీ ఒక్క అడుగు వెనక్కి పడితే స్ప్రింగ్‌లా పైకి లేవడం చాలా కొద్దిమందికే సాధ్యం. అలాంటి వారిలో పుల్లెల గోపీచంద్ ముందుంటాడు. ‘కోచ్‌గా నాణ్యమైన క్రీడాకారులను తయారుచేసి, వారి ద్వారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తా’ అన్నాడు. అది మనసు లోతుల్లోంచి వచ్చిన మాట. అందుకోసం పుష్కర కాలం శ్రమించాడు. సమయాన్ని లెక్కచేయక బ్యాడ్మింటన్ నేర్పించడాన్ని ఓ తపస్సులా భావించిఆచరణలో పెట్టాడు. ఫలితం… 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచింది.
గోపి గీసిన బొమ్మ…
బాపు బొమ్మ లాగ ఆమె గోపి గీసిన బొమ్మ. అతను విసిరిన ఆరడుగుల రాకెట్టు.రియో ఒలింపిక్స్ లక్ష్యంగా పీవీ సింధుపై దృష్టి సారించాడు గోపీ. అగ్రశ్రేణి క్రీడాకారిణుల్ని అవలీలగా ఓడించే సింధులో నిలకడ లేకపోవడం ప్రధాన లోపమని గుర్తించాడు. పెద్ద క్రీడాకారిణుల్నే మట్టికరిపించిన సింధు, అనామక క్రీడాకారిణుల చేతుల్లో సులువుగా ఓడిపోతుండేంది. రియోకు ముందు సరిగా ఈ లోపాలపైనే దృష్టి సారించాడు గోపీ. రెండు నెలల కఠోర శిక్షణతో ఆ లోపాల్ని సరిచేశాడు. డిఫెన్స్‌లో బలంగా తయారు చేశాడు. కదలికల్లో వేగం పెంచి.. ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చాడు. ప్రతి మ్యాచ్‌లో దూసుకెళ్లే విధంగా ఆమెను మలిచాడు.ఫలితం రియోలో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి రజిత పతకాన్ని అందించింది.
గోపిచంద్ సాధించిన అపురూప విజయానికి గుర్తింపుగా 1999లో అర్జున పురస్కారము, 2000-01లో రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డు లభించాయి. 2005లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గోపిచంద్ పుల్లెల్ల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నారు. శిష్యురాలు సైనా నెహ్వాల్ బ్యాట్మింటన్ రంగంలో తన ప్రతిభను చాటుతుంది. 2009 జులై 29న భారత ప్రభుత్వం గోపిచంద్‌కు ద్రోణాచార్య పుర స్కారము ప్రకటించింది. 2014లో ఆయనకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు లభించింది.
త్వరలో గోపీచంద్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్మించే ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారని సమాచారం. గోపిచంద్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కోరుకుంటోంది.