హ్యాపీ బర్త్ డే..మెగాస్టార్

45
- Advertisement -

నాలుగు దశాబ్దాల కిందట తెలుగు సినిమాల ఒరవడిని మార్చిన ఒక ప్రభంజనం. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఎందరో సినీ మహానుభావుల్లో ఆయనది ప్రత్యేక స్థానం. ఆయనే కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌. కోట్లాది అభిమానుల గుండెల్లో చిరంజీవిగా చెరగని స్థానం సంపాదించుకున్న మెగాస్టార్‌.ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ ప్రత్యేక కథనం.

ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తండ్రి కానిస్టేబుల్ అయినా నటనపై మక్కువతో 1976లో మద్రాసు వచ్చి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ స్కిల్స్‌లో డిప్లొమో పట్టా పొందారు. పునాది రాళ్లు సినిమాతో సినీ జీవితం ప్రారంభించిన ప్రాణం ఖరీదు సినిమా ముందుగా రిలీజైంది.

1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తనను నటుడిగా ఒక మెట్టు పైకి ఎక్కించింది, ఆ సినిమా తర్వాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, సంఘర్షణ, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, యముడికి మొగుడు, దొంగ మొగుడు వంటి వరుస విజయాలతో సుప్రీమ్ హీరో నుండి మెగాస్టార్ అయ్యాడు. విజేత, స్వయంకృషి, రుద్రవీణ వంటి సందేశాత్మక చిత్రాలతో సైతం నటించి మెప్పించారు.

కె.విశ్వనాథ్ తీసిన శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాలు తనకు నటుడిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. కె.రాఘవేంద్రరావు తీసిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఇప్పటికీ మాస్టర్‌పీస్‌లా ఉండిపోయింది. సినిమాలలో బిజీగా ఉంటూనే 1998లో మదర్ థెరిస్సా స్పూర్తితో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ప్రారంభించి, కొన్ని వేల కుటుంబాలలో వెలుగులు నింపాడు.

Also Read:ట్రెండింగ్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

2006లో పద్మభూషణ్ అవార్డు, అలాగే అదే సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. 10 సార్లు ఫిల్మ్‌ఫేర్,మూడుసార్లు నంది , 2016లో రఘుపతి వెంకయ్య అవార్డులు అందుకున్నారు చిరు.

2007లో శంకర్‌దాదా జిందాబాద్ చిత్రంతో వెండితెరకు దూరమై 2008లో రాజకీయ తెరంగ్రేటం చేశాడు. 2008లో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించి, 2011లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన చిరు దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఖైదీ నెం.150తో సత్తాచాటిన చిరు తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా మూవీలో నటించి మెప్పించారు. అలనాటి హీరోలైన ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణలతోనే కాకుండా వారి తరువాతి తరాలకు, అలాగే వారి మూడవ తరానికి కూడా పోటీగా ముందుకు సాగిపోతున్నారు. భాష‌, ప్రాంతంతో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న చిరు ఆరు ప‌దుల వ‌య‌స్సులోను తనలో సత్తాతగ్గలేదని వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆయన మ‌రిన్ని సినిమాల‌తో మ‌న‌ల్ని అల‌రిస్తూ,ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని మరోసారి మెగాస్టార్‌కి బర్త్ డే విషెస్‌ చెబుతోంది greattelangaana.com

Also Read:ఉపేంద్ర గాడి అడ్డా..ప్రారంభం

- Advertisement -