రంగు రంగు లోకమని అందమైన రంగులుంటాయని అందరూ అంటున్నారు రామహరి అంటూ సినీ ఇండస్ట్రీలోని కష్టాలను వర్ణిస్తూ పాటను రాసాడో కవి. అవును ఎందుకంటే సినిమా అంటేనే అదో రంగులలోకం. ముఖాలకు రంగులేసుకుని రాణించాలని చాలామంది కలలు కంటుంటారు. ఎందుకంటే సినీ ఫీల్డ్ కున్న గ్లామర్ మరే ఫీల్డ్ కు లేకపోవడమే. లక్కు బాగుంటే రాత్రికి స్టార్ అయిపోతారు. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.
ఒక్క ఛాన్స్ అంటూ కృష్ణానగర్ నుండి మొదలై ఫిలింనగర్‌లోని అన్ని స్టూడియోలు చుట్టేసే వారెంతో మంది. ఎన్నో అవమానాలు అంతకుమించి చిత్కారాలు..ఒకవేళ ఛాన్స్ దక్కినా నిలదొక్కుకుంటామన్న గ్యారెంటీ ఉండదు. అలాంటి రంగుల ప్రపంచంలోకి కోటీ ఆశలతో ఎంటరై ఇప్పుడు కనీసం తినడానికి తిండిలేక, ఆస్పత్రి బిల్లు కట్టలేక నరకయాతన పడుతోంది ఆ హీరోయిన్.
తెలుగులో హనుమాన్ జంక్షన్,కన్నడలో నాగమండల, సూర్యవంశ వంటి పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది విజయలక్ష్మి. తర్వాత సినిమా అవకాశాలు రాక ఇబ్బందులు తాళలేక బుల్లితెర బాటపట్టింది. కొద్దికాలం బాగానే అక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఉన్న డబ్బు కాస్తా హరించుకుపోయింది.
తీవ్ర కష్టాల్లో ఉన్న విజయలక్ష్మీకి సడెన్‌గా బీపీ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వెంటనే కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయులో చికిత్స అందిస్తుండగా కొంతకాలంపాటు ట్రీట్ మెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు డాక్టర్స్.
అయితే కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడంతో ఆస్పత్రి బిల్లు కట్టేందుకు కూడా డబ్బులు లేవని తమకు సాయం చేయాలంటూ కోరుతోంది విజయలక్ష్మి చెల్లెలు ఉషాదేవి.తమ కటుంబాన్ని ఆదుకోవాలని కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌ని కోరగా వారు వెంటనే స్పందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలను తెలుసుకుని వైద్యసాయం అందించేందుకు ముందుకువచ్చారు.