బాహుబలి సృష్టించిన కలెక్షన్ల సునామీకి టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా సాహో అన్నాయి. బాహుబలిని మించిన సినిమా తీయాలని తమ సినిమా బడ్జెట్ గేట్లు కూడా ఎత్తేశాయి. భారీ బడ్జెట్‌తో సినిమా తీయాలని కోలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పటీనుండో ఎదురుచూస్తుంది. ఆ బాధ్యతను తమిళ దర్శకుడు సుందర్.సి తీసుకున్నాడు. రూ. 250 కోట్ల బడ్జెట్‌తో ఆర్య, జయం రవి తదితరులతో ‘సంఘమిత్ర’సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ టైటిల్ రోల్ సంఘమిత్రలో శృతిహాసన్‌ను తీసుకున్నారు. సంఘమిత్ర కోసం శృతి కత్తిసాము, గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్‌లో సంఘమిత్ర లుక్‌ను విడుదల చేశారు.
ఇక పట్టాలెక్కనున్న సమయంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది శృతి. దీంతో ఈ పాత్ర కోసం బాహుబలి ఫేమ్ అనుష్కను నటింపజేసే ప్రయత్నం జరిగింది. తను ఇప్పటికే బాహుబలి చిత్రం కోసం రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. మళ్లీ అన్ని కాల్‌షీట్స్‌తో తానీ చిత్రం చేయలేనని చేతులెత్తేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంఘమిత్ర పాత్ర కోసం కథానాయిక వేట మళ్లీ మొదలైంది. దీంతో దర్శకుడి హన్సికను సంప్రదించినట్లు తెలిసింది. గతంలో సుందర్.సి దర్శకత్వంలో ‘అరణ్మనై’, ‘అరణ్మనై 2’ చిత్రాల్లో నటించారు హన్సిక. ఇందులో కూడా ఆమెనే కథానాయికగా ఎంచుకునే అవకాశముందని సమాచారం. కత్తిసాము వంటి పోరాట సన్నివేశాలు ఉండటంతో ఆమెను ఎంతవరకు ఎంపిక చేస్తారనే విషయమూ ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.