మోహన్ బాబు, మంచు విష్ణు చిత్ర హింస‌లు పెట్టారు- హెయిర్ స్టైలిస్ట్

75
- Advertisement -

టాలీవుడ్‌ హీరో, మా అధ్య‌క్షుడు మంచు విష్ణుపై తన హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీ‌ను సంచలన కామెంట్స్‌ చేశాడు. ఇటీవల మంచు విష్ణు త‌న ఆఫీసులో దొంగతనం జరిగిందని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీ‌ను కొద్ది రోజుల నుంచి క‌నిపించ‌డం లేద‌ని.. దీంతోపాటు ఆఫీస్‌లో రూ.5 ల‌క్ష‌లు విలువైన హెయిర్ డ్రెస్సింగ్‌, మేక‌ప్ సామ‌గ్రి కూడా కనిపించడం లేదని.. వాటిని శ్రీను దొంగిలించి ఉంటాడ‌ని మంచు విష్ణు మేనేజ‌ర్ పోలీసు స్టేషన్‌ కేసు పెట్టాడు. అయితే ఈ వ్యవహారంలో సంచలన నిజాలు బయటికొచ్చాయి. ఈ నిజాలను నాగ‌శ్రీ‌ను స్వ‌యంగా ఓ వీడియోలో తెలియజేశాడు.

మోహ‌న్‌బాబు త‌న‌ను తిట్ట‌డం, త‌న‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టి కొట్ట‌డం అక్క‌డ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింద‌ని తెలిపాడు. ఈ మొత్తం సంఘ‌ట‌న ఫిబ్ర‌వ‌రి 17వ తేదీన మ‌ధ్యాహ్నం 1 గంట‌కు జ‌రిగింద‌న్నాడు. మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి త‌న‌ను చిత్ర హింస‌ల‌కు గురి చేశార‌ని శ్రీను తెలిపాడు. త‌న‌ను చెప్పుకోలేని బూతులు తిట్టార‌ని, కులం పేరిట దూషించి అవ‌మానించార‌ని అన్నాడు. అందువ‌ల్లే తాను ఉద్యోగం మానేసిన‌ట్లు తెలిపాడు. అలా వారి వ‌ద్ద ఉద్యోగం మానేసినందుకు త‌న‌పై దొంగ‌త‌నం అభాండం మోపార‌ని వెల్లడించాడు.

కాగా గ‌త 10 సంవ‌త్స‌రాలుగా తాను మోహ‌న్ బాబు వ‌ద్ద న‌మ్మ‌కంగా ప‌నిచేస్తున్నాన‌ని, త‌న‌పై ఇలాంటి నింద‌లు మోప‌డం స‌రికాద‌ని, విష్ణు త‌న‌పై అన‌వ‌స‌రంగా కేసులు పెట్టించార‌ని ఆరోపించాడు. త‌న‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేయ‌డంతో ఆ విష‌యం త‌న త‌ల్లికి తెలిసింద‌ని.. దీంతో ఆమెకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వ‌చ్చింద‌ని.. ఈ క్ర‌మంలోనే ఆమెను హాస్పిట‌ల్‌లో చేర్పించి చికిత్స‌ను అందిస్తున్నామ‌ని అన్నాడు. మాలాంటి పేదవారిని నిందించడం సరికాదని.. ద‌య‌చేసి ఈ కేసుల నుంచి త‌న‌ను వ‌దిలేయాల‌ని కోరాడు. ప్రస్తుతం శ్రీను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోహన్‌ బాబు కుటుంబంపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. మరి మంచు ఫ్యామిలి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -