సీఎం కేసీఆర్ పనితీరు భేష్‌: గవర్నర్ తమిళిసై

210
governor tamilisai

సీఎం కేసీఆర్ పరిపాలన తీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు గవర్నర్ తమిళిసై. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి సభలో ప్రసంగించిన గవర్నర్‌ …సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఆరేళ్లు ప్రణాళికబద్దంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి యావత్‌ దేశం అబ్బురపడుతోందన్నారు. సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు.పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని సంకల్పించి సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని స్పష్టం చేశారు.

గతంలో రేషన్‌షాపు ద్వారా ఒక్కొక్కరికీ 4 కిలోల బియ్యం అందితే.. ఇప్పుడేమో ఒక్కొక్కరికీ 6 కిలోల బియ్యం చొప్పున అందిస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో చేపపిల్లలను ప్రభుత్వం వదిలిందని గవర్నర్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేదలకు భద్రత కల్పించాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని రూ. 60 వేల నుంచి రూ. లక్షన్నరకు పెంచిందని గవర్నర్‌ తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్‌ పాఠశాలలను నడుపుతోందన్నారు. విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాల్లో ప్రభుత్వం సన్నబియ్యం భోజనాన్ని అందిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రగతినిధిని ఏర్పాటు చేసిందన్నారు. డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్‌ జర్నలిస్టులకు రూ. 5 లక్షల ప్రమాదబీమాను ప్రభుత్వం కల్పించిందని గవర్నర్‌ తెలిపారు.

పట్టణాల్లో రూ. 75 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచింది. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో తక్కువ వేతనంతో పని చేస్తున్న ఉద్యోగులు కూడా సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులయ్యారని తమిళిసై తెలిపారు.

పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం బ్రహ్మణ సంక్షేమ పరిషత్‌ నెలకొల్పిందని గుర్తు చేశారు. పూజారులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తోందని గవర్నర్‌ స్పష్టం చేశారు. మసీదుల్లో ఉండే ఇమామ్‌, మౌజమ్‌లకు నెలకు రూ. 5 వేల చొప్పున భృతి అందిస్తోందన్నారు. పోలీసు, ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించిందని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పాటైన కొత్తలో విద్యుత్‌ కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవి. ఇప్పుడు విద్యుత్‌ కోతలను అధిగమించి, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమాతో భరోసా కల్పించామని తమిళిసై తెలిపారు. ప్రసంగం ముగిసిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు సభలో చర్చ జరగనుంది.